Tuesday, November 26, 2024

గ్రాంట్లు, సాయాల్లో భారీగా కోతలు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు కుదింపు..

ప్రతి యేటా రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు దెబ్బతీస్తున్నాయి. దీంతో బడ్జెట్‌ అంచనాలు తారుమారవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 8 నెలల ఆదాయ వివరాల్లో భారీ వ్యత్యాసం నెలకొంది. నవంబర్‌ నాటికి రూ.1.17 లక్షల కోట్ల రాబడి అంచనాల్లో కేవలం రూ.74,970 కోట్లే సాధ్యపడింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గ్రాంట్ల రూపంలో వచ్చే నిధుల్లో కోతలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విభజన హామీల్లోనూ కార్యాచరణ పురోగతి లేకుండా పోయింది. కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో ఈ ఏడాదిలో రూ.38,669 కోట్లు అంచనా వేసుకోగా గడచిన 8 మాసాల్లో కేవలం రూ.5,687 కోట్లే వచ్చింది. 2019-20లో ఈ మొత్తాలు కేవలం రూ.11,598 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. 2020-21లో రూ.10,525 కోట్లనే అంచనా వేసుకోగా, ఈ ఏడాది రూ.38,669 కోట్లు అంచనా వేశారు. అయితే వచ్చింది కేవలం 15శాతంలోపే. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు కేంద్రం ఏనాడూ విడుదల చేయ లేదు. 2020-21లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, కాంట్రిబ్యూషన్ల రూపంలో రూ.10,525 కోట్ల అంచనా వేయగా, రూ.15,471 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక మీదట రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు 30కి మించవని స్పష్టమ వుతోంది.

కేంద్ర ప్రాయోజిత పథకాలను కేంద్ర ప్రభుత్వం హేతుబద్దీ కరించడంతో ఈ సవరణ రాష్ట్రాల్లో కనిపించనుంది. సీఎస్‌ఎస్‌ల జాబితాలో జాతీయ ఆరోగ్య మిషన్‌, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన, నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మిషన్‌, సర్వశిక్షా అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌, మధ్యాహ్న భోజనం వంటి అనేక పథకాలున్నాయి. గ్రామీణ సంస్థలకు కేంద్ర గ్రాంట్లు, స్వచ్చ భారత్‌ కింద మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల్లో కోతలు పడ్డాయి. ఇక మీదట కేంద్ర ప్రాయోజిత పథకాల బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రాలకిచ్చే వెసులుబాటు నిధులను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో స్వల్ప ఊరట కల్గనుంది. ఈ నిధులను రాష్ట్రాలు ఆయా పథకాల ప్రయోజనాల దృష్ట్యా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖర్చు చేసుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. గతంలో ఉన్న 60 పథకాలను 30కి కుదించిన కేంద్రం పథకాలను మూడు రకాలుగా వర్గీకరించింది. అవి అతి ముఖ్యమైన, ముఖ్యమైన, ఐచ్చికమైనవిగా వర్గీకరణ చేసింది. దీంతో ముఖ్యమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కేంద్ర పథకాలకు తప్పనిసరిగా నిధుల విడుదల జరగనుండగా, ఈ పథకంలోని పలు నిబంధనలను, నియంత్రణలతో కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది.

గత రెండేళ్లుగా తగ్గుతున్న నిధుల వాటా…
గతేడాది కాలంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు భారీగా నిధులు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగింది. ఆశించిన నిధులు రాకపోవడంతో ప్రభావం అంతా ఆయా పథకాలపై పడుతోంది. 2016-17 వార్షిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రూ.9,163 కోట్లు రానున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 2015-16లో ఇవి రూ.6,497 కోట్లు కాగా… అంతకు క్రితపు ఏడాదితో పోలిస్తే ఇవి భారీగా తగ్గాయని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. 2014-15లో ఈ పద్దు కింద తెలంగాణకు రూ.11,781 కోట్లు ఖజానాకు చేరాయి. కానీ గత రెండేళ్లుగా నానాటికీ కేంద్ర పథకాలకు కేంద్రం తన వాటాను తగ్గిస్తూ వస్తోంది. ఫలితంగా తగ్గిన వాటా మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పెరుగుతోంది. కేంద్ర సాయానికి తోడు రాష్ట్రం కూడా తన వంతుగా కొంత మొత్తాన్ని కలిపి ఈ పథకాలను అమలు చేయాల్సి రావడంతో ఈ భారం రాష్ట్ర ఖజానాపై పడుతోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఖజానాకు అంచనా వేసిన గ్రాంట్లు కాంట్రిబ్యూషన్‌లు (రూ. కోట్లలో….)
ఏడాది అంచనా విడుదల శాతం
2018-19 29041 8177 28.16
2019-20 8177 11598 141.83
2020-21 10,525 15471 146.99
2021-22 38669 5687 14.71

వీటికే కోతలు…
కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా ఎక్కువ శాతం నిధులు గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సి ఉండగా భారీగా తగ్గింపులు చేశారు. సమగ్ర వాటర్‌షెడ్‌ ఫథకానికి గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.125 కోట్లను పూర్తిగా కోత పెట్టింది. జాతీయ జీవనోపాధి మిషన్‌ పథకం వచ్చే నిధులు కూడా రూ.103 కోట్ల నుంచి రూ.76 కోట్లకు తగ్గడంతో ఈ పథకంపై కొంత మేర ప్రభావం పడనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్త్తున్న పేదల పింఛన్ల పథకానికి కేంద్రం నుంచి రూ.254 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది.
15వ ఆర్ధికసంఘం నిర్దేశించినట్లుగానే రాజ్యాంగంలోని 270 ఆర్టికల్‌ ప్రకారం ఆయా రాష్ట్రాలకు వారి దామాషాలో కేంద్రం నిధులను వెచ్చిస్తోంది. అయితే ఇవి కూడా అనేక సందర్భాల్లో తీవ్ర జాప్యమైన ఉదంతాలున్నాయి. కేంద్ర పన్నులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, పన్నుల వాటాలో వచ్చే నిధులతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం నిధులను రాష్ట్రాల హక్కుగా ఇవ్వాల్సిందే. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో కేంద్రం ఏ రాష్ట్రానికి ఏ పథకం కింద ఎంత మేర నిధి ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనలేదు. గతంలో పథకాల వారీగా కేటాయింపులను స్పష్టం చేయడం ఆనవాయితీ. గత మూడేళ్లుగా ఏ ఏడాది కూడా కేంద్రం ఒక్క రూపాయి అధికంగా తెలంగాణకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక సాయంగా 2015-16 నుంచి మూడేళ్లపాటు రూ.450 కోట్ల చొప్పున రూ.1,350 కోట్లు విడుదల చేసింది. ఇక అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్లుగానే కేంద్ర ప్రాయోజిత పథకాలకు నాలుగేళ్లలో రూ.23,116 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో 2014-15లో రూ.5,028 కోట్లు, 2015-16లో రూ.6,047 కోట్లు, 2016-17లో రూ.6,579 కోట్లు, 2017-18లో రూ.5,463 కోట్లు కేటాయించింది. తెలంగాణకు సీఎస్‌టీ పరిహారం రూపంలో రూ.11,443 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.1,253 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement