కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి హైకోర్టు ఊరటనిచ్చింది. భూ కుంభకోణం కేసులో తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.
గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.