Sunday, November 10, 2024

TG | రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తూ రైతులకు పెద్దపీట వేస్తుందని, రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయ, సహకార చెంత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లు పాల్గొనగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఐనాల చైతన్య రెడ్డి, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నామన్నారు.. ఇప్పటివరకు రైతు ఖాతాలో జిల్లాలో రూ.7650 కోట్లు జమ చేశామన్నారు. రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను కూడా మాఫీ చేశామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అన్నారు.

జిల్లాలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వస్తానన్నారు. త్వరలో వ్యవసాయ మార్కెట్ కు వ్యవసాయ గిడ్డంగులను మంజూరీ చేస్తానని తెలిపారు. తెలంగాణ వస్తే త్రాగు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించామని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పదవిని బాధ్యతగా చూసుకోవాలని, బాధ్యతగా భావించినప్పుడే ప్రజలకు సేవ చేయగలుగుతారని, మంచి పేరు తెచ్చుకోని మార్కెట్ అభివృద్ధికి, రైతు శ్రేయస్సుకు పాటుపడాలని మంత్రి అభిలాషించారు.

- Advertisement -

ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం…

ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి నాకు తెలుసునని అన్ని సమస్యలను త్వరగా పరిష్కారిస్తానని చెప్పారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, గ్రామాలు బాగుంటాయని అన్నారు.గృహలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు సమచిత స్థానం కల్పిస్తూ మహిళలు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అంతకుముందు ఆలేరు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్ గౌడ్, డైరెక్టర్ లు సిల్వేరు బాలరాజు గౌడ్, మాడోతు విఠల్ నాయక్, డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి, పాండవుల భాను ప్రకాష్ గౌడ్, మదర్ డెయిరీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, కల్లేపల్లి శ్రీశైలం, నాయకులు మోత్కూపల్లి ప్రవీణ్, ఎల్లంలా సంజీవ రెడ్డి, మార్కెట్ పాలక వర్గ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, మార్కెట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement