Friday, November 22, 2024

Delhi: దేశంలో ఆహారధాన్యాల సంక్షోభం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో ఆహారధాన్యాల సంక్షోభం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల కృషితో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. 2017-18లో 285.01 మిలియన్ టన్నుల నుంచి 2021-22లో 314.51 మిలియన్ టన్నులకు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ అని కేంద్ర మంత్రి తెలిపారు.

గోధుమల‌కూ నిల్వల కొరత లేదు..
దేశంలో సెంట్రల్ పూల్‌లో గోధుమ నిల్వల కొరత లేదని లోక్‌సభలో ఎంపీ రాకేశ్ సింగ్ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జవాబిచ్చారు. దేశంలో ఈ సీజన్ జులై 29 నాటికి మనదేశంలో 9 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. సాధారణంగా కురవాల్సిన 428.3 ఎంఎం వర్షపాతానికి బదులు 465.6 ఎంఎం వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఈ ఏడాది జులై 1 నాటికి బఫర్ స్టాక్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 275.8 లక్షల మెట్రిక్ టన్నులకు బదులు 285.10 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement