Friday, November 22, 2024

పుస్తకాలు లేకుండా చదువెలా? జూన్‌ 13 నుంచి పాఠశాలలు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పుస్తకాలు చూస్తూ టీచర్‌ చెప్పే అంశాన్ని వింటెనే అర్ధం కాని పాఠాలు ఇక పుస్తకాలు లేకుండా వింటే ఏమర్ధమవుతాయో ఒక్కసారి ఆలోచించండి. జూన్‌ 13 నుంచి పాఠశాలలు పున:ప్రారంభానికి ముందే జిల్లా కేంద్రాలకు, పాఠశాలలకు చేరాల్సిన పాఠ్యపుస్తకాలు ఇంత వరకూ పూర్తిస్థాయిలో ఇంకా చేరనేలేదు. ప్రతీ ఏడాది పాఠశాలలకు ప్రారంభానికి ఒక రోజు ముందే ఒకటి లేదా రెండు సబ్జెక్టులు మినహా అన్ని పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసేవారు. కానీ బడులు ప్రారంభానికి ఇంకా వారం రోజుల గడువే ఉన్నా నేటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సరఫరా జరగలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 25 లక్షలే పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరినాయని అధికారులు చెప్తున్నారు. దాదాపు కోటి 15 లక్షల పాఠ్యపుస్తకాలు ఇంకా పాఠశాలలకు చేరాల్సిఉంది. ఈనెలాఖరు వరకు చేరుతాయని అధికారులు చెప్తున్నా అవి ఎప్పటి వరకు చేరుతాయో అనేదానిపై స్పష్టత లేదని ఉపాధ్యాయులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే జూలై వరకు పుస్తకాలు లేకుండానే విద్యార్థులు తమ చదువులు సాగించాలన్నమాట. గత రెండేళ్లు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో పుస్తకాలు లేకుండానే చదువులను చాలా మంది లాంగించేశారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరానికి కరోనా తగ్గుముఖం పట్టి చదువులు సాఫీగా సాగుతున్న క్రమంలో పాఠ్యపుస్తకాలు అందక పిల్లలు మళ్లిd చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 25 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరగా, మిగిలిన 1.15 కోట్ల పుస్తకాలు ఈనెల చివరి వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఒక సబ్జెక్టుకు రెండు పుస్తకాలు…

ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్‌ మీడియంలో పాఠాలను ముద్రిస్తున్నారు. అలాగే ఒకవైపు ఉర్ధూ..మరో వైపు ఇంగ్లీష్‌ పాఠ్యాంశాలనూ ముద్రిస్తున్నారు. పక్కపక్కనే తెలుగు ఇంగ్లీష్‌ పాఠ్యాంశాలు ఉండడం ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయనే ఉద్ధేశంతో ఈ విధంగా ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాల సైజు, బరువు పెరుగుతుండటంతో ఒక సబ్జెక్టు పుస్తకాన్ని రెండుగా విభజిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే 2వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1కు పార్ట్‌1 పుస్తకం, ఎస్‌ఏ-2కు పార్ట్‌-2 పుస్తకంగా ముద్రించారు. ప్రథమార్థంలో పార్ట్‌1, ద్వితియార్థంలో పార్ట్‌2గా విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధించనున్నారు. పార్ట్‌1 పుస్తకాలు ముందుగా అవసరం ఉండడంతో వాటిని ముందస్తుగా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల అలసత్వం కారణంగా టెండర్లు, పేపర్‌ కొరతతో పుస్తకాల ముద్రణ, పంపిణీలో ఆలస్యం అయినట్లుగా ఆరోపణలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement