ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : బస్సు చక్రాన్ని నడిపే కార్మికులు తమ బతుకు బండిని లాగడానికి అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అకాశాన్నంటిన నిత్యావసరాలు వెరసి… రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం భరించడం వారికి కత్తిమీద సాములా తయారైంది. పేరుకు ఆర్టీసీ ఉద్యోగులు అయినా వారి వేతనా లు మాత్రం అంతంత మాత్రమే. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను క్లాస్-3, క్లీనర్లను క్లాస్-4 ఉద్యోగులుగా పరిగణిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులతో పోలీస్తే వీరి వేతనాలు సగంకన్నా తక్కువే. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన విద్యుత్ శాఖలో పనిచేసే క్లాస్ 4 ఉద్యోగుల బేసిక్ రూ.23,380 కాగా.. ఆర్టీసీలో పనిచేసే క్లాస్-4 ఉద్యోగుల బేసిక్ రూ.10,880 మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులనే కాకుండా కొన్ని విభాగాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల కన్నా వీరి జీతభత్యాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలతో పోల్చుకుంటే తమ వేతనాలు తక్కువగా ఉన్నాయని, వాటితో సమానంగా పెంచా లని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచే అనేక పోరాటాలు చేసినప్ప టికీ నేటివరకు అమలు కాలేదు. ఆర్టీసీ మ్యాన్‌వల్ ప్రకారం ప్రతి నాలుగేళ్ల కోసారి చేపట్టాల్సిన వేతన సవరణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా అగిన వేతన సవరణ..
ఆర్టీసీలో ప్రతి 4సంవ్సతరాలకు ఒకసారి వేతన సవరణను అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ కార్మికుల మొదటి పే-రివిజన్‌కు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. 2017 ఏప్రిల్ 1నుంచి అమలు కావాల్సిన పే-రివిజన్‌కు సంబంధించి కేవలం 16శాతం ఐఆర్ మాత్రమే చెల్లించారు. ఆరేళ్లు దాటినా.. ఇప్పటి వరకు 2017కు సంబంధించి ఫిట్‌మెంట్ మొదలగు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2021 ఏప్రిల్ 1నుంచి అమలు కావాల్సిన 2వ వేతన సవరణ గడువు ముగిసి 16నెలలు గడుస్తున్నా… యాజమాన్యం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 వేతన సవరణకు సంబం ధించి రావాల్సిన బకాయిలకు గాను అప్పట్లో 5సంవత్సరాల బాండ్లను కార్మికులకు ఇచ్చారు. వాటి గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా… ఇంకా చెల్లింపులు చేయలేదు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెల్లించే డీఏ గత ఐదు విడతలుగా ఆగిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.