కేటుగాళ్ల చేష్టల కారణంగా నకిలీకి కాదేది అనర్హం అన్న చందంగా మారింది. పాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు ఇలా ఏది చూసినా కల్తీ చేస్తున్నారు. చివరకు కరోనా చికిత్సకు ఉపయోగించే మందులను కూడా నకిలీ తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రెమిడెసివిర్ మందుకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఏర్పడటంతో కేటుగాళ్లు నకిలీ మందులను తయారుచేస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేక మోసపోతున్నారు.
ఒరిజినల్ రెమిడెసివర్ మందు కొనేటప్పుడు బాక్స్ పైన రెడ్ వార్నింగ్ లేబుల్ ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో ‘కోఫియర్’ అనే పెద్ద అక్షరాలు ఉంటాయి. కంపెనీ పేరుతో మ్యానుఫ్యాక్చర్డ్ అండర్ లైసెన్స్ అని ఉంటుంది. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ అనే అక్షరాల కింద హైదరాబాద్, తెలంగాణ అని ఉండాలి. ఒకవేళ హైదరాబాద్, ఇండియా అని ఉంటే నకిలీ మెడిసిన్ అని అర్థం. అటు బాక్స్ కింద కంపెనీ అడ్రస్‌లో తెలంగాణ స్పెల్లింగ్ తప్పు ఉంటే అది నకిలీ మందు కిందే లెక్క. వీటిని గమనించి రెమిడెసివిర్ మెడిసిన్ కొనుగోలు చేయాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.