హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆ ధాన్యాన్ని లారీల్లో నింపి రైసు మిల్లులకు పంపించినా ప్రయోజనం చేకూరడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం రైసు మిల్లులకు చేరినా అన్లోడ్ చేసేందుకు హమాలీలు లేక పోవడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒకేసారి వాహనాలు రైసు మిల్లులకు చేరడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారు లపై ఉన్న రైసు మిల్లులకు ధాన్యం లోడ్‌తో కూడిన లారీలు, వాహనాలు పోటెత్తడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాహన యజమానులు చెబుతున్నారు. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించే వారు లేక ఒకవేళ రైతుల నుంచి ధాన్యం కొన్నా వాహనాల్లో లోడ్ చేసేందుకు హమాలీలు లేక ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ధాన్యంతో కూడిన వాహనాలు రైసు మిల్లులకు చేరినా దించుకునే నాదుడు లేక రోజుల తరబడి పడిగాపులు పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు, క్లీనర్లు లబోదిబోమంటున్నారు. రెండు రోజులపాటు వేచి చూస్తామని లేనిపక్షంలో ఎక్కడ నుంచి ధాన్యాన్ని తీసు కొచ్చామే అక్కడికే వెళ్లి ధాన్యాన్ని అన్లోడ్ చేస్తామని లారీల యజమానులు హెచ్చరిస్తున్నారు.
హమాలీల కొరత కారణంగా ధాన్యాన్ని దించుకోలేకపోతున్నామని , రాత్రివేళల్లో పనిచేసేందుకు ససేమిరా అంటున్నారని రైసు మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి తోపాటు హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కర్నూలు, హైదరాబాద్-విజయవాడలపై ఉన్న జాతీయ రహదారులపై కిలోమీటర్ల కొలది ధాన్యం లారీలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి ధాన్యం బస్తాలతో కూడిన వాహనాలను రహదారులకు సమీపంలో దారిమళ్లిస్తున్నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపిం చడం లేదని చెబుతున్నారు. ఒక్కో రైసు మిల్లు దగ్గర 100 నుంచి 150 వాహనాలు నిలిచి ఉన్నాయని, ఒక్కో వాహనం లోని ధాన్యాన్ని అన్లోడ్ చేసేందుకు కనీసం రెండు, మూడు గంటల సమయం పడుతోందని రైసు మిల్లుల యాజ మానులు చెబుతున్నారు. ధాన్యాన్ని తూకం వేసి తీసుకో వాల్సి వస్తుండడంతో అన్‌లోడింగ్‌కు జాప్యం జరుగుతోందం టున్నారు. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వం చేసే చోటు అంతా నిండిపోవడంతో ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నా బాద్‌లోని పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల లోడ్‌తో పలు వాహనాలు బారులు తీరడంతో అటుగా వచ్చే వాహనాల, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అదే సమయంలో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేసేందుకు మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో మిల్లర్లు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. దాంతో 3, 4 రోజుల నుంచి ధాన్యం లోడింగ్‌తో ఉన్న టాక్టర్లు, లారీలు అన్లోడ్ కాకుండా మిల్లుల ఎదుటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడింగ్‌కు మూడు, నాలుగు రోజులు పడుతుండడంతో ఆ ప్రభావం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపైనా పడుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి తూకం అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడుతోంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. కల్లాల్లో ధాన్యం తూకం వేసి వారం గడిచినా లోడింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం అయినా లోడింగ్ అయ్యేంత వరకు ధాన్యం తడవకుండా కాపాడాల్సిన బాధ్యత రైతుదే కావడంతో ధాన్యాన్ని కాపాడలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మరోవైపు వానా కాలం సమీపిస్తుండడంతో ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని పెట్టుకుని ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..