Friday, November 22, 2024

రాష్ట్రాన్ని ఉద్ధరించలేని వాడు దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడు? : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని ఉద్దరించలేని వాడు దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ఉంటుందని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయి, ఇరుక్కుపోయిన స్థితిలో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఉందని చెప్పుకొచ్చారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో హైదరాబాద్‌లో ఇదే విషయంపై చర్చ జరిగిందని ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసొచ్చే వారెవరైనా ఉన్నారంటే వారంతా సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న వారేనని ప్రభాకర్ విమర్శించారు.

అనంతరం దిగ్విజయ్ తెలంగాణ పర్యటనపై ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతిని పరిష్కరించడం కోసం దిగ్విజయ సింగ్ హైదరాబాద్ వస్తున్నట్టు చెబుతున్నా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కోసమేనని అభిప్రాయపడ్డారు. గతంలో టీఆర్ఎస్ – కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి దిగ్విజయసింగే కారణమని తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలన్న ప్రయత్నం కూడా ఆయన చేశారని ప్రభాకర్ తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటులకు డ్రగ్స్ కేసుల్లో నోటీసులు ఇస్తే కేటీఆర్ తట్టుకోలేక సవాల్ విసురుతున్నారని ఆయన ఆరోపించారు. వారిని కాపాడడం కోసమే కేటీఆర్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement