ఓ మహిళ రెండుసార్లు ఆడపిల్లలకే జన్మనిచ్చింది. కాగా మగ పిల్లాడిని కనలేదని ఆమె ఆమె భర్త, భర్త కుటుంబీకులు విచక్షణారహితంగా దాడికి దిగారు. రోడ్డుపైకి లాక్కొచ్చి మరీ కొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహోబా జిల్లాకు చెందిన ఓ మహిళ రెండు సార్లు గర్బం దాల్చింది. ఆ రెండు సార్లూ ఆడ పిల్లలకే జన్మ ఇచ్చింది. కానీ, మొదటి నుంచి తమకు కుమారుడే కావాలని భర్త పట్టుపట్టాడు. భర్తతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేశారు. కానీ, ఆ మహిళకు రెండు కాన్పుల్లోనూ ఆడ పిల్లలే జన్మించారు. దీంతో భర్త కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా వేధించారు. తాజాగా, ఆమెను వీధిలోకి తెచ్చి మరీ చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. బాధితురాలిని నడి రోడ్డుపై ఇద్దరు ముగ్గురు కలిసి దాడి చేస్తున్నారు.
కొంత దూరంలో చాలా మంది ఈ దాడిని చూసినా మిన్నకుండిపోయారు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. తన భర్త, భర్త కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కొడుకును కనలేదని నింద వేస్తూ దాడులు చేస్తున్నారని ఆవేదనగా తెలిపింది. తొలిసారిగా అమ్మాయిని కన్నప్పుడే ఈ వేధింపులు మొదలయ్యాయని ఆమె వివరించింది. రెండో కాన్పులోనూ ఆడ పిల్ల పుట్టడంతో వారు మరింత రెచ్చిపోయారని తెలిపింది. ఆడ పిల్లను కన్నానని అత్తవారింట్లో తనను పస్తులు ఉంచారని పేర్కొంది. భోజనం పెట్టకుండా నిలిపేశారని వివరించింది. దీంతో తాను కూలి పనికి వెళ్తున్నానని వాపోయింది. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వివరించారు. గాయపడ్డ ఆ మహిళను హాస్పిటల్ చేర్చారని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని మహోబా ఎస్పీ సుధా సింగ్ వివరించారు. తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.