Saturday, November 23, 2024

హడ్కో రుణంపైనే హౌసింగ్‌ శాఖ ఆశలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఆర్థిక కష్టాలు అటు అధికారులకు ఇటు కాంట్రాక్టర్లకు వెంటాడుతున్నాయి. గృహ నిర్మాణ కార్పొరేషన్‌ అధికారులేమో హడ్కో(హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రుణంపై ఆశలు పెట్టుకుంటే.. కాంట్రాక్టర్లేమే కార్పొరేషన్‌పై పెట్టుకున్నారు. వెరసీ పేద ప్రజలకోసం నిర్మించే డబుల్‌ ఇండ్ల నిర్మాణంపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. 2020 మే నెల తర్వాత డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కింద జరిగిన పనులకు గాను చెల్లించాల్సిన సుమారు రూ.705 కోట్ల బిల్లులను గృహ నిర్మాణ శాఖ ఇప్పటి వరకు విడుదల చేయలేదని సమాచారం. హడ్కో నుంచి రుణం లభిస్తేనే కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు అనుకుంటున్నారు. దీనికిగానూ రూ.2వేల కోట్ల రుణం కోసం హడ్కోపైనే హౌసింగ్‌ శాఖ ఆశలుపెట్టుకుంది. ఆ రుణం కోసం ఆశాఖ అధికారుల విశ్వప్రయత్నాలు చర్చిస్తున్నారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. అప్పట్లో 2,91,057 ఇళ్లను నిర్మించాలని అనుకుంది. ఇందులో హైదరాబాద్‌ నగర పరిధిలోనే లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలను ప్రభుత్వం రచింది. కానీ 2.91 లక్షలకు పైగా ఇళ్లల్లో ఇప్పటి వరకు దాదాపు 1,13,535 వరకు ఇళ్లను మాత్రమే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీటిలో సగం అంటే 57,469 ఇళ్లు జిల్లాల్లో, 56,066 ఇళ్లు గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్మించారు. ఇప్పటి వరకు వీటిలో 17వేల వరకు ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరో 69,488 ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. నిర్మాణం ప్రారంభించాల్సిన ఇళ్లు ఇంకా 61,606 వరకు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్మించిన 1,13,535 ఇళ్ల పెండింగ్‌ బిల్లులు రూ.705 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,13,535 ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మిస్తే, వీటికి రూ.14,786 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది రూ.10,800 కోట్లు అని తెలుస్తోంది. ఈ నిధుల్లోనూ హడ్కో నుంచి వచ్చిన రుణమే రూ.8,744 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ కూడా పెంచకపోవడంతో కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం పడుతోంది. పైగా నిర్మించిన ఇళ్లకు పెండింగ్‌ నిదుల కోసం కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్లు చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. హౌసింగ్‌ శాఖనేమో హడ్కో రుణం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా అప్పు మాత్రం పుట్టడంలేదు. ఇప్పటికే స్పెషల్‌ సీఎస్‌ ఇదే విషయంపై ఢిల్లికి వెళ్లి హడ్కో అధికారులతో భేటి అయి వచ్చారు. రుణం ఇప్పటికే వస్తుందని అధికారులు భావించినప్పటికీ ఇంత వరకు రుణంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement