Tuesday, November 26, 2024

ఇండ్లు కట్టారు.. ఇవ్వడం మరిచారు! భూపాలపల్లిలో పూర్తైన ఇండ్లు కేటాయించాలంటున్న లబ్ధిదారులు

భూపాలపల్లి, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌రూం పథకం అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో ముందుకు వెళ్ళడం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పేదొడి స్వంత ఇంటి కలకు ఇంకా మోక్షం లభించడం లేదు. ఏళ్ళు గడుస్తున్నా అర్హులైన లబ్ధిదారులు గూడుకోసం ఎదురుచూస్తునే ఉన్నారు. కొన్ని చోట్ల ఇండ్లు పూర్తైనా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుని బూత్‌ బంగ్లాలను తలపిస్తూ దర్శనమిస్తుండగా.. మరికొన్ని చోట్ల నిర్మాణాల పనులు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. దీంతో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు స్వంతింటికి కల నెరువెరుతుందో లేదో అనే నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో డబుల్‌ నిర్మాణాలకు ట్రబుల్‌ ఏర్పడింది. మొత్తం 3,891 ఇండ్లు, రూ.198 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో 1,325 ఇండ్ల పనుల నిర్మాణాలకు మోక్షం లభించనేలేదు. 1,686 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భూపాలపల్లి మండలంలోని వేశాలపల్లిలో ఎస్‌డీఎఫ్‌ 2017-18 నిధులతో రూ.50లక్షలతో 13-07-2019న సుమారు 544 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు, భాస్కర్‌ గడ్డలో సుమారు 400 ఇండ్లకు శంకుస్థాపన చేశారు. నూతన టెక్నాలజీ ఉపయోగించి అన్ని హంగులతో ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. అయితే అధికారులు లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయాలనే ఊసే మర్చిపోవడంతో నిర్మాణం పూర్తైన ఇండ్లు అర్హులకు అందించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని ప్రారంభానికి ముందే పిచ్చిమొక్కలు పెరిగి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. కిటీకిల అద్దాలు ధ్వంసం కాగా, తలుపులు, కరెంటు సామగ్రి, సానిటేషన్‌, పైపులు చోరికి గురయ్యాయి. దీంతో ఇవి బూత్‌ బంగ్లాలుగా దర్శనమిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వాటి పరిస్థితిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ‘రాజుల సొమ్ము రాళ్ళ పాలు’ అన్న చందంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పరిస్థితి దాపురించింది.

కాగా జిల్లాలో పలు మండలాల్లో నిధుల కొరతతో ఇండ్లు పూర్తికాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మాత్రం పూర్తైన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు శ్రద్ధవహించకపోవడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. సంవత్సరాల తరబడి తమకు ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారులు స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండటంతో రెవెన్యూ అధికారులు మాత్రం తమకు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంకా లబ్ధిదారుల లిస్ట్‌ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి.

- Advertisement -

నిర్మాణాలు పూర్తైన ఇండ్లు

భూపాలపల్లి మండలం వేశాలపల్లిలో 544, భాస్కరగడ్డలో సుమారు 400, చిట్యాల మండలం జడల్‌పేటలో 06, గణపురం మండలంలో 27, మహాదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌లో 23, మహాదేవపూర్‌లో 35, గూడాడ్‌పల్లిలో 40, రేగొండ మండలం పొనగండ్ల లో 60, టేకుమట్ల మండలం రాఘవపూర్‌ 25, రామకృష్ణపూర్‌ 25, గర్మిళ్ళపల్లి 18, కలికోటపల్లి 08, కాటారంలో 37, మల్హర్‌లో 32 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తికాగా.. భూపాలపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఇండ్ల పంపినీలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.

నిర్మాణాల్లో జాప్యం.. అధికారుల పర్యవేక్షణ కరవు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో 94 ఇండ్లు మంజూరుకాగా జపనీస్‌ టెక్నాలజీతో నిర్మించిన ఇండ్లు పూర్తికాక అర్థాంతరంగానే ఆగిపోయాయి. అధికారుల పర్యవేక్షణలేక గతంలో జరిగిన పనులు నాసిరకంగా ఉండటంతో నిర్మాణాలు పూర్తికాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆ నిర్మాణాలు నీళ్ళలోనే తేలియాడుతున్నాయి. ప్రస్తుతం అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదిక పనులు పూర్తి చేసి పైరవీలకు తావులేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అందించి పేదోడి సొంతింటి కల నిజం చేసేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement