అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వి.వినోద్
కుమార్ అకస్మాత్తుగా సెలవుపై వెళ్ళిపోయారు. డీఎంఈలో పెరుగు తున్న ఒత్తిళ్ళే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీవీవీపీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వినోద్‌కుమార్‌కు గతేడాది సెప్టెంబర్‌లో డీఎంఈగా అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే వినోద్‌కుమార్ డీఎంఈలో తనదైన శైలిలో పాలన ప్రారంభించారు. మంత్రుల స్థాయి నుంచి వచ్చే ఒత్తిళ్ళను సున్నితంగా తిరస్కరిస్తు న్నారు. డీఎంఈలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న వినోద్ కుమార్ సెలవుపై వెళ్ళిపోవడం ఇప్పుడు వైద్యశాఖలో హాట్ టాపిగ్‌గా మారింది. జాయింట్ కలెక్టర్ క్యాడర్‌లో ఉన్న ఆయన కలెక్టర్ పోస్టింగ్ కోసం గత కొంత కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నా రని, ఈక్రమంలోనే సెలవు పెట్టారని ఒక వాదన విపిస్తుండగా, అదేం కాదని డీఎంఈ కార్యాలయంలో ఎదురవుతున్న ఒత్తిళ్ళ నేపథ్యం లోనే సెలవుపై వెళ్ళారని మరో బలమైన వాదన వినిపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎండోమెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హరి జవహర్‌లాల్‌కు ఏపీవీవీపీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ మెడికల్‌కళాశాల ప్రిన్సిపాల్ నరసింహులును డీఎంఈ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించగా తాను ఆ బాధ్యతల్ని చేపట్టలేనని ఆయన తిరస్కరించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రొఫెసర్ వరప్రసాద్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తుట్లు సమాచారం.
హాట్ చైర్
తాజా పరిస్థితుల నేపథ్యంలో డీఎంఈగా బాధ్యతలు చేపట్టడం అంటే కత్తిమీద సామె అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖపై ఫోకస్ పెట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిశిత పరిశీలన చేస్తున్నారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తే చాల్లే అనే విధంగా ఉండే వైద్యశాఖలో ఇప్పుడు పూర్తి జవాబుదారీతనాన్ని పెంచడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరంతర నియామకం ప్రక్రియను చేపట్టడంతో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 మెడికల్ కళాశాలల పనులు ఊపందుకుంటున్నాయి. వైద్యశాఖకు విరివిగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ తన అంచనాలకు అనుగుణంగా పనులు జరగడం లేదన్న అసంతృప్తిని సీఎం పలు సందర్భాల్లో అధి కారుల వద్ద వ్యక్తం చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. పలు సమీక్షల సందర్భంగా వినోద్ కుమార్ ఇదే విషయాన్ని ప్రసా ్తవించారని సిబ్బంది ద్వారా తెలుస్తోంది . డీఎంఈగా వినోద్ కుమార్ బాధ్యతలు చేపట్టాక ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. ఆ శాఖలోని అక్రమార్కులకు ఇది కంటగింపుగా మారింది. ఏళ్ళ తరబడి పాతు కుపోయిన అవినీతిరాయుళ్ళు సహాయ నిరాకరణ చేపట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. డీఎంఈ కార్యాలయంలో బదిలీలు, పోస్టింగ్‌లు తదితర విషయాలకు సంబంధించి 1,500 ఫైళ్ళు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, వైద్యుల బదిలీలకు సంబంధించి మంత్రుల స్థాయిలో వస్తున్న సి’ఫార్సు’ల్ని సైతం వినోద్‌కుమార్ పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు రిక్వెస్ట్ లపై ససేమిరా అన్నట్లు వినికిడి. ఈక్రమంలో పై నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు, క్రిందిస్థాయి ఉద్యోగుల సహాయ నిరాకరణల పై విసుగు చెందడం వల్లే వినోద్‌కుమార్ సెలవుపై వెళ్ళిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అక్రమార్కులపై చర్యల్లేవ్
గతంలో డీఎంఈగా పనిచేసిన ఎం.రాఘవేంద్రరావు హయాం లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసున్నాయనే అభియో గాలు బలంగా ఉన్నాయి. కార్యాలయంలో ఒక వర్గంతో వసూళ్ల దందాకు తెరతీశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈక్రమం లో వైద్యశాఖ మంత్రి విడదల రజని, వైద్యశాఖ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మరీ వసూళ్ళకు తెరలేపారు. పెండింగ్ బిల్లుల క్లియె రెన్స్, బదిలీల విషయంలో పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో గతేడాది సెప్టెంబర్‌లో విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎంఈ కార్యాల యంలో విచారణ చేసి రాఘవేంద్రరావును బదిలీ చేయడంతో పాటు కొందరు ఉద్యోగులపై బదిలీ వేటు వేయాల్సిందిగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యేకేషన్ (డీఎంఈ) కేంద్రంగా సాగిన అవినీతి లెక్క తేల్చేందుకు ప్రభుత్వం విచారణ కమిటీని గతేడాది అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు అమరావతి, కాకినాడ, కర్నూలు ప్రాంతాల్లో పర్యటిం చింది. రాఘవేంద్రరావు డీఎంఈగా పనిచేసిన సమయంలో ఓ కోటరీని ఏర్పాటు చేసుకొని భారీ కాంట్రాక్ట్‌ల కేటాయింపులు పెద్ద మొత్తంలో వసూళ్ళు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు, పెండింగ్ బిల్లులతో పాటు రాఘవేంద్రరావు హయాంలో జరిగిన కాంట్రాక్ట్ కేటాయింపులపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. రాఘవేంద్రరావుకు సహకరించిన ఆ వర్గం ఉద్యోగులు దర్జాగా డీఎంఈలో ఉద్యోగాలు చేస్తున్నారు. వినోద్‌కుమార్ కు విధి నిర్వహణలో ఉద్యోగుల సహాయ నిరాకరణ వెనుక రాఘవేంద్ర రావు గ్రూపు ఉద్యోగుల హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యం లో డీఎంఈ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టిసారించా లన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.