హైదరాబాద్ – తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని భావిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయనను డిశ్చార్జ్ చేయాలని వైద్యుల నిర్ణయించారు.