హైదరాబాద్, ఆంధ్రప్రభ: హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను టీఎస్‌పీఎస్‌సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. బుధవారం నుంచి జూలై 1 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. అలాగే జూలై 26 వరకు వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. 22 పోస్టులకు గానూ ఈనెల 17న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే హర్టికల్చర్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో అడిగిన ఓ ప్రశ్న అభ్యర్థుల్లో చర్చకు దారితీస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ఇవ్వబడే నెలసరి భత్యం ఎంత? అని ఉండగా దానికి ప్రాథమిక కీలో సమాధానం 3016 అని ఉంది.
జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని బుధవారం విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు చేస్తోంది. పరీక్ష ముగిసి 15 రోజులు అవుతున్నా ప్రైమరీ కీని ఎప్పుడు విడుదల చేస్తారని అభ్యర్థులు ఆంధోలన వ్యక్తం చేస్తున్నారు.