Friday, November 22, 2024

Big story | యాసంగిపై ఆశలు అడియాశలు.. అకాల వర్షాలతో చేతికందని వరి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వానాకాలం పంట కంటే యాసంగిలో ‘సాగులోనే ధాన్యం దిగుబడి అధికంగా వస్తుందని ఆశించిన రైతులకు ఈ ఏడాది యాసంగి కన్నీటిసాగుగా మిగిలింది. మరో వారం , పది రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు అదేపనిగా కురుస్తుండడంతో పంటపై ఆశలు వదిలేసుకున్నారు. యాసంగిలో వరికోతలు ఇప్పటికే 70శాతం మేర పూర్తయ్యాయి. మిగతా 30శాతం మేర పంటంతా వడగళ్లు, ఈదురుగాలులకు దెబ్బతిన్నది. ఈ దశలో ఇక యాసంగి సాగుపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ఆ పంటను కోసినా వరికోత మిషన్‌ ఖర్చులు మీదపడడం తబితే చేతికందే ధాన్యం ఏమి ఉండదని రైతులు స్పష్టం చేస్తున్నారు. చివరకు పశువులను వరి పొలాల్లో వదిలేస్తున్నారు.

రికార్డుస్థాయిలో సాగు… అదేస్థాయిలో పంట నష్టం…

- Advertisement -

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఏడాదే యాసంగిలోనే రికార్డుస్థాయిలో రాష్ట్రంలో వరిసాగయింది. దాదాపు 56.4లక్షల ఎకరాల్లో వరిసాగయింది. సాధారణంగా రైతులకు యాసంగి వరిసాగే లాభదాయకంగా ఉంటుంది. యాసంగిలో అయితే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వస్తాయని వానాకాలం పంట కంటే యాసంగిపైనే రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. చిన్నా, చితకా రాళ్ల వానలు మినహా పెద్దగా వర్షాలు పడవని దిగుబడిపై ధీమాతో ఉంటారు. వానాకాలంలో నీటి నిల్వకు తెగుళ్ల అధికంగా సోకుతూ, సూర్యరశ్మి తగినంతగా లేక గింజ నాణ్యతగా రాదు. కానీ ఈ యాసంగి సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అకాల వర్షాల రూపంలో విపత్తు విరుచుకుపడడంతో రైతుల ఆశలు అడిశాయలు అయ్యాయి.

పెట్టుబడి కూడా దక్కని విపత్కర పరిస్థితులు…

ఏకంగా మూడు దఫాలుగా అకాల వర్షాలు ఈదురుగాలులు, వడగళ్లరూపంలో రైతుపై విరుచుకుపడ్డాయి. మార్చి 16 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నెలరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. మార్చిలో వారంపాటు, ఏప్రిల్‌ నెలలో ఏకంగా మూడు వారాలపాటు ఈ నెలలో దాదాపు నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వరి పంట చేతికందే పరిస్థితులు తుడిచిపెట్టుకుపోయాయి. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు కనుచూపు మేరలో కూడా రైతులకు కానరావడం లేదు.

7లక్షల ఎకరాల్లో వరి పంట ధ్వంసం…

అకాల వర్షాలకు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, జనగామ, హనుమకొండ, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్‌ కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్‌, కొత్తగూడెం, మెదక్‌, రాజన్నసిరిసిల్ల, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, నిర్మల్‌, వరంగల్‌, , యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వనపర్తి, మంచిర్యాల, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, ములుగు, భూపాలపల్లి, జిల్లాల్లో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలకు రైతులు ఎక్కువగా నష్టపోయిన పంట వరినే. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 7 లక్షల ఎకరాల్లో వరి పంట ద్వంసమైంది. అయితే అనధికారికంగా, పంట నష్టం సర్వే పూర్తయ్యేలోపు కేవలం వరి పంట నష్టం 15లక్షల ఎకరాలకు చేరుకుంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వరి తర్వాత ఎక్కువగా మొక్కజొన్న 2లక్షల ఎకరాల్లో, మామిడి పంటకు లక్ష ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలైన మామిడి, మిర్చి, నిమ్మ పంటలు కూడా అకాల వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

50లక్షల మెట్రిక్‌ టన్నులు రావడం కూడా కష్టమే…

అకాల వర్షాల ముప్పుతో యాసంగి ధాన్యం కొనుగోళ్లు కూడా నెమ్మదించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే యాసంగిలో కొనుగోలు కేంద్రాలకు ఏకంగా కోటి మెట్రిక్‌ టన్నుల దాకా ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాని ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 25రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవం 9లక్షలా మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకోనున్నాయి. వడగళ్ల కారణంగా ఈ యాసంగిలో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement