హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎర్రనేలల్లో పండిన మిర్చికి వ్యవసాయ మార్కెట్‌లలో మంచి ధర లభిస్తోంది. కొద్ది రోజులుగా పడిపోయిన మిర్చి ధరలు క్రమంగా పెరుగుతుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మిర్చి ధరలు దాదాపు 30శాతంపైగా పెరిగాయి. ఈసారి అధికవర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మిర్చి పంట దెబ్బతినడం, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వరంగల్ మిర్చి వ్యాపారుల అసోసియేషన్ చెబుతోంది. ప్రస్తుతం మిర్చి పంటల కోతల సీజన్ కావడంతో రాష్ట్రంలోని వరంగల్ ఏనమాముల వ్యవసాయ మార్కెట్, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్, నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ తదితర జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్‌లలోకి ప్రతి రోజు మిర్చి పెద్ద ఎత్తున వస్తోంది.
పోయిన ఏడాది మిర్చి క్వింటాల్ ధర రూ.15వేల లోపు పలకగా ఈ ఏడాది అది రూ.20వేలకు క్వింటాల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో మిర్చి వ్యాపారం చేసేందుకు తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. రానున్న రోజుల్లో మిర్చి ధర క్వింటాల్‌కు రూ.25వేలను దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి కోతలు రెండు పికింగ్‌లకు చేరాయి. మార్చి చివరి నాటికి మరో రెండు సార్లు కాయలు ఏరే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ కొత్త మిర్చి క్వింటాల్ కు రూ.80,100 ధర పలికింది. ఈ సారి మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు సంతోషంగా చెబుతున్నారు.
ఈ ఏడాది మిర్చి సీజన్ రాష్ట్రంలో జనవరి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం మిర్చి కోతలు పీక్ స్టేజీలో ఉండడంతో పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్లకు వస్తోంది. తెలంగాణలో తేజ, వండర్ హాట్, యూఎస్ 341, 1048 మిర్చి తదితర రకాల మిర్చి గణనీయమైన విస్తీర్ణంలో సాగవుతోంది.