హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజీ దర్యాప్తులో భాగంగా తెరమీదకు హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి కోసం పేపర్‌ను టీఎస్పీఎస్సీ ఓ ఉద్యోగి లీక్ చేయడమనేది సంచలనం సృష్టిస్తోంది. ఈనెల 13న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షలను కంప్యూటర్ హ్యాకింగ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్ష వాయిదా వేయడం వెనుక జరిగింది హ్యాకింగ్ కాదని హనీట్రాప్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఓ అమ్మాయి మత్తులో పడి టీఎస్పీఎస్సీ ఉద్యోగి టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాన్ని లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొంత మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సదరు ఉద్యోగితో పాటు మొత్తం పది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొంత కాలంగా ఓ యువతి ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉంటూ పేపర్ లీక్‌కు కారణమైందని పోలీసులు దర్యాప్తులో తేలింది. పేపర్ ఇవ్వాలని ప్రవీణ్‌ను ఆ యువతి తరచూ కలిసేందుకు ఏకంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చేదని తెలుస్తోంది. యువతితో సన్నహితంగా ఉంటున్న ప్రవీణ్ ఆమె కోసమే టౌన్‌ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రవీణ్ ఒక్కడే ఇదంతా చేశాడంటే అది జరిగే పనికాదు. ఇందులో మరికొంత మంది హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒక పేపర్ రూ.10 లక్షలు?…
టీఎప్పీఎస్సీ పేపర్ లేకేజీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ద్వారా లీకైన పేపర్ ఇతరుల చేతికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో లీకైన పేపర్‌ను రూ.10 లక్షలకు ఒకటిగా విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ను కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు గతంలో అతను ఏమైనా లీకేజీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని వెనుకు ఎవరెవరూ ఉన్నారనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.
పాస్వర్డ్ ఎలా దొరికింది..!
ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రవీణ్‌తో ఆ యువతి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ యువతి ఎవరనేది, ఇందులో ఎవరి పాత్ర ఉందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఓ యువతి అతడిని కలిసేందుకు పలుమార్లు కార్యాలయానికి కూడా వచ్చినా.. కమిషన్ సిబ్బంది ఎందుకు పసిగట్టలేకపోయారనేది తెలియాల్సి ఉంది. ఈ లీకు కారణంగా వేలాది మంది అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా చేశారు. అయితే అత్యంత కట్టుదిట్టమైన పాస్ వర్డ్స్‌తో ఉండే అతిముఖ్యమైన టీఎస్పీఎస్సీ కంప్యూటర్ను ఎలా తెరిచాడనేది ప్రశ్నగా మారింది.
ఆ పాస్ వర్డ్స్ అతిడికి ఎలా తెలిశాయి? కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అతడు ఎలా ప్రింట్ తీశాడు (ప్రింట్ ఆప్షన్ లేనట్లుగా తెలుస్తోంది)? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇంకా రాబట్టాల్సి ఉంది. లీక్ చేసిన ప్రశ్నపత్రాన్ని అతడు ఎంతమందికి అందించాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే టీఎస్పీఎస్సీ సెక్షన్ ఇన్చార్జీ ఓ అధికారిని డైరీలో రాసుకున్న పాస్వర్డ్ ఆధారంగా కంప్యూటర్ ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. సదరు అధికారి మాత్రం డైరీలో ఏ పాస్వర్డ్ రాసుకోలేదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ మెంబర్ పాత్రపై అనుమానాలు?..
ఇదిలా ఉంటే పేపర్ లీకేజీపై టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ పాత్ర ఉందనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కమిషన్ సెక్రటరీ పీఏతో తనకున్న సంబంధాలతో గతంలోనూ ఇలాంటి పేపర్ లీక్ ఘటనలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు అన్నికోణాల్లో లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్కావడంతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి శనివారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.