Friday, November 22, 2024

Delhi: ఏపీ, తెలంగాణ‌ వివాదాలపై ఈ నెల 27న హోంశాఖ భేటీ.. చీఫ్ సెక్రటరీలకు లేఖలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ నడుం బిగించింది. ఈ క్రమంలో ఈ నెల 27న ఉదయం గం. 11.00కు రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను సమావేశానికి హాజరుకావాల్సిందిగా సూచిస్తూ లేఖలు పంపించింది. సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్టు ఎజెండాలో పేర్కొంది. ఇందులో 7 అంశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించినవి కాగా, మిగతా 7 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపర్చిన హామీలకు సంబంధించినవి ఉన్నాయి.

ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజనలో నెలకొన్న వివాదాల పరిష్కారం మొదటి అంశంగా పేర్కొనగా, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థ విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలసీర్, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థల విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు బ్యాలెన్స్ విభజన మిగతా అంశాలుగా ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ క్యాష్ క్రెడిట్, 2014-15 రైస్ సబ్సిడీ విడుదలలో వాటాలు వంటివి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల్లో ఉన్నాయి.

వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విభజన హామీల అంశాలను కూడా సమావేశం ఎజెండాలో కేంద్ర హోంశాఖ చేర్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగరానికి కేంద్ర సహాయం అంశాన్ని మొదటగా పేర్కొంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపర్చిన పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్, కొత్త విద్యాసంస్థల ఏర్పాటు, కొత్త రాజధానిలో ర్యాపిట్ రైల్వే కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అలాగే పన్ను ముదింపులో పొరపాట్లను సవరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే కోరుతున్నందున ఈ అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ సమావేశం ఎజెండాలో చేర్చింది.

ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరించే విషయంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులను కూడా సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement