హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల్లోని కొందరు ఇంజనీర్ల పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా పలు చర్చోపచర్చలు, అధ్యయనాల అనంతరం రూపొందించిన , తీసుకున్న నిర్ణయాలను కొందరు అధికారులు పొరుగు రాష్ట్రాలకు చేరవేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. డిప్యూటేషన్ పై జలసౌధలో పాతుకుపోయిన సీ నియర్ అధికారులే ఈ పని చేస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల్లోని సీనియర్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం తెలంగాణ ఇరిగేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా, గోదావరి బోర్డులో నియమ నిబంధనలకు విరుద్దంగా పెద్ద సంఖ్యలో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దీంతో కృష్ణా, గోదావరికి సంబంధించిన కీలక సమాచారం కాగితాలకెక్కకుండానే పక్క రాష్ట్రానికి చేరిపోతోందని ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. నీటి విడుదలపై కొందరు అధికారులు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి అయిదేళ్లు ఒకే చోట డిప్యూటేషన్‌పై పనిచేస్తే ఆతర్వాత తన మాతృశాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ అధికారిని డిప్యూటేషన్‌పై కొనసాగించాలంటే కొద్ది రోజులు అతడిని మాతృశాఖకు పంపించాల్సి ఉంటుంది. కాని రెండు బోర్డుల్లో ని కొందరు ఉన్నతాధికారులు తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి అదేస్థానాల్లో కొనసాగుతున్నారు. కనీసం వారి మాతృసంస్థకు ఒక్కసారి కూడా వెళ్లడం లేదు. చాలా కాలం నుంచి అక్కడే ఉండడం, పలు అంశాల్లో ఉన్నతాధికారులకు సహకరిస్తుండడంతో వారిని వెనక్కు పంపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రయోజనాలను కాపాడే అత్యంత రహస్య సమాచారం సులువుగా డిప్యూటేషన్ అధికారులకు తెలిసిపోవడమే కాకుండా వారి ద్వారా పొరుగు రాష్ట్రానికి చేరుతోందని అధికారులు చెబుతున్నారు.
కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు హోరాహోరీగా , పకడ్బంధీ వ్యూహాలతో తలపెడుతున్నాయి. అయితే ఏదో ఒక రూపంలో ఏపీదే పై చేయి అయ్యే విధంగా తెలంగాణ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖలోని పలు విభాగాల్లో ఏపీకి చెందిన అధికారులే ఆధిపత్యం వహిస్తున్నారని తెలంగాణ ఇంజనీర్లు వాపోతున్నారు. దీంతో బోర్డులో తీసుకున్న నిర్ణయాలు, సమావేశాల్లో చేయాల్సిన వాదనలు వెంటనే పొరుగు రాష్ట్రానికి చేరిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టుల పరిశీలన, తనిఖీలకు వెళ్లే సమాచారం కూడా లీకవుతోందని తెలంగాణ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలలోనూ ఇదే తరహా దోరణి నెలకొందని, ఇండెంట్ పెట్టాలని ఏపీకి ముందుగానే చెప్పి… అక్కడి నుంచి ఇండెంట్ రాగానే వెంటనే అనుమతి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల సమాచారం కూడా వెంటనే ఏపీకి వెళ్లిపోతుండడంతో బోర్డుల్లోని కొందరు ఉన్నతాధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటేషన్ పై వస్తూ కృష్ణా బోర్డులో ఏపీ అధికారులు తిష్టవేయడంతో తెలంగాణ అధికారులకు చోటు దక్కడం లేదంటున్నారు తెలంగాణ ఇంజనీర్లు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు బయటకు రాకుండా కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం సఫలీకృతం అవుతోందని, దానికి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులే కారణమంటున్నారు. జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాల్లో డిప్యూటేషన్ అధికారుల అంశం చర్చకు రానీయకుండా అడ్డుకుంటున్నారంటే ఆ అధికారులు ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..