న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల ప్రక్రియలో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను గుర్తుల ద్వారా ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పాలని కోదాడ స్వతంత్ర అభ్యర్థి జలగం సుధీర్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కోదాడ నుంచి ఎన్నికల గుర్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎన్నికల గుర్తుల మీద ఆధారపడి పోటీ చేయడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అక్షరాస్యత అత్యల్పంగా ఉన్నకాలంలో ఈ గుర్తులు అవసరమయ్యాయని, కానీ ప్రస్తుతం కొన్ని సర్వేల ప్రకారం దేశంలో 72% మంది మహిళలు, 84% మంది పురుషులు అక్షరాస్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. 1968లో వచ్చిన గుర్తుల విధానం ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉందని సుధీర్ అభిప్రాయపడ్డారు.
ప్రధాన పార్టీలకు శాశ్వత గుర్తులు ఉండడం వల్ల ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉంటుందని, కానీ స్వతంత్ర అభ్యర్థులు మంచివారైనప్పటికీ తమ గుర్తు గురించి ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేసుకోడానికి ఎక్కువ సమయం ఉండదని అన్నారు. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా తాను పోటిచేస్తున్నానని, ఈ క్రమంలో ఎటువంటి గుర్తు కేటాయించకుండా కేవలం పేరు, ఫోటోతో మాత్రమే ఎలక్షన్ ప్రక్రియలో ఉండటానికి తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సుధీర్ ఎలక్షన్ కమీషనర్‌ను కోరారు.