ఈనెల 18 నుంచి అడిలైడ్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌కు 20 మంది సభ్యుల జాతీయ మహిళల జట్టును హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. ఈ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. హాంగ్జౌ ఆసియా క్రీడలకు ముందు జట్టు సన్నాహాల్లో భాగంగా ఈ పర్యటన ఉంటుంది. ఇటీవలే బల్బీర్ సింగ్ సీనియర్ హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2022) అవార్డును అందుకున్న ఏస్ గోల్ కీపర్ సవిత భారత జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఆమెకు జట్టు వైస్ కెప్టెన్‌గా దీప్ గ్రేస్ ఎక్కా సహకారం అందించనున్నారు.
డిఫెండర్లు దీప్ గ్రేస్ ఎక్కా, నిక్కీ ప్రధాన్, ఇషికా చౌదరి, ఉదిత, గుర్జిత్ కౌర్‌లతో కూడిన జట్టులో బిచు దేవి ఖరీబామ్ రెండవ గోల్ కీపర్‌గా వ్యవహరిస్తారు. నిషా, నవజోత్ కౌర్, మోనికా, సలీమా టెటే, నేహా, నవనీత్ కౌర్, సోనికా, జ్యోతి, బల్జిత్ కౌర్ మిడ్‌ఫీల్డర్లుగా ఉంటారు. 250కి పైగా అంతర్జాతీయ క్యాప్‌లు సాధించిన సీజన్డ్ స్ట్రయికర్ వందన కటారియా భారత ఫార్వర్డ్లైన్కు నాయకత్వం వహిస్తుంది.
ఆమెతో పాటు లాల్రెమ్సియామి, సంగీతా కుమారి, షర్మిలా దేవి కీలకప్లేయర్లుగా ఉన్నారు. మే 18, 20,21 తేదీల్లో ఆస్ట్రేలియాతో, మే 25, 27 తేదీల్లో ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ తలపడుతుంది. అడిలైడ్‌లోని మేట్ స్టేడియం మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.