దేశంలో హెచ్ఎంపీవీ కలకలం
కర్నాటక, మహారాష్ట్ర, తమినాడు, గుజరాత్‌లో వైరస్
7కు పెరిగిన పాజిటివ్ కేసులు
త్వరగానే కోలుకుంటున్నారన్న డాక్టర్లు
ట్రావెల్ హిస్టరీ లేకున్నా వైరస్ అటాక్
ఆందోళన వద్దంటున్న కేంద్ర మంత్రి నడ్డా
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (HMPV) భారత్‌లో విస్తరిస్తోంది. సోమవారం ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో గుజరాత్‌లో 1, కర్నాటక, నాగ్‌పుర్, తమిళనాడుల్లో రెండేసి హెచ్ఎంపీవీ కేసులు రికార్డ్ అయ్యాయి. పైగా ఈ వైరస్ బారిన పడిన వారంతా నెలల బిడ్డలే కావడం గమనార్హం. అయితే.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
డోంట్ వర్రీ – కోలుకుంటున్నారు..
బెంగళూరులో ఇద్దరు చిన్నారులు (ఒక ఆడ, ఒక మగ బిడ్డ) శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వగా మూడు నెలల చిన్నారి కోలుకుని, ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యింది. కాగా, మరో చిన్నారి త్వరగా కోలుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్‌లోని తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది.
ట్రావెల్ హిస్టరీ లేకున్నా..
చైన్నైలో మరో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ చిన్నారులు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన 2 నెలల శిశువు కూడా వైరస్ బారినపడింది. వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ శిశువులు తల్లిదండ్రులు ఎవ్వరికీ విదేశీ ప్రయాణాలు చేసిన నేపథ్యం లేదు. మరి ఈ వైరస్ ఎలా భారత్‌లోకి వచ్చిందో తెలియాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
భయపడాల్సిన పనిలేదు..
దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఓ వీడియో విడుదల చేశారు.