Tuesday, November 26, 2024

Big story | పెద్దగోల్కొండలో చారిత్రిక అన్వేషణ.. లభ్యమైన కళ్యాణ చాళుక్యుల కాలం నాటి గణపతి విగ్రహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ చరిత్రను సుసంపన్నం చేసే అనేక చారిత్రిక ఆధారాలు లభ్యమవుతున్నాయి. నేటి హైదరాబాద్‌ 400 సంవత్సరాల పూర్వమే అనేక రాజవంశాలు కేంద్రంగా చేసుకుని పాలించిన చారిత్రక ఆధారాలు కొత్తకథలను చెప్పుతున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్ద గోల్కొండ గ్రామంలో చారిత్రిక పరిశోధన బృందాలు జరిపిన అన్వేషణలో అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి.

క్రీ.శ. 12వ శతాబ్దిలో పూజ లందుకున్న గణపతి దేవుని శిలావిగ్రహం లభ్యమైంది. ఈవిగ్రహం కళ్యాణ చాళుక్యుల కాలం నాటిదని చరిత్ర కారులు నిర్ధారించారు. చరిత్ర కారుడు డా. ఎస్‌. జైకిషన్‌ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్‌ ఇండియా పౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుల బృందం నిర్వాహకులు రామోజు హరగోపాల్‌ తో కలిసి జరిపిన పరిశోధనల్లో ఈ ప్రాచీన విగ్రహం లభ్యమైంది.

పెద్ద గోల్కొండ లోని భగీరథ శివాలయం ,ఆంజనేయ ఆలయాల ముందు విఘ్నేశ్వరుని విగ్రహం లభ్యమైంది. మూడు అడుగులవెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు, రెండు అడుగుల మందంతో నల్ల శానపురాతితో చెక్కిన గణేశుని రెండుచేతుల్లో దంతం, కుడుములు ఉన్నాయి. తలపై చిన్నకిరీటం,లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయాల కంకణాలు,కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చొని ఈవిగ్రహం ఉంది.

విగ్రహం లక్షణాలన్నీ పరిశీలిస్తే క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శిల్పకళ ఆధారాలున్నాయని ఈమనిశివనాగిరెడ్డి చెప్పారు. అలాగే గణేషుని విగ్రహం పక్కన కాకతీయ స్థంభం, కప్పురాయి, శిఖర శిథిలాలున్నాయి. ఈవిగ్రహ సంపద హైదరాబాద్‌ చరిత్ర ను వందల సవత్సరాల ముందుకు తీసుకువెళ్లాయని ఆయన చెప్పారు. చారిత్రిక ప్రాధాన్యత గల ఈ విగ్రహానికి స్థానికులు వేసిన రంగును తొలగించి ప్రత్యేక ఫలకాలపై భద్రపర్చాలని ఆయన అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement