Saturday, November 23, 2024

SEBI | హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిరాధారం..

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని సెబీ చీఫ్‌ మాధబి బచ్‌, ఆమెభర్త ధవల్‌ బచ్‌ ఆరోపించారు. సెబీ విశ్వసనీయతపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని చెప్పారు.

తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలను కూడా అధికారులు ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పారు. ఈ మేరకు ఆదివారం మాధబి దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మా జీవితం తెరిచిన పుస్తకం.. ఇప్పటికే కొన్నేళ్లుగా అన్ని రకాల వివరాలను సెబీకి సమర్పిస్తూ వచ్చాం.

ఏశాఖ అధికారులు కోరినా.. మేం ప్రయివేటు వ్యక్తులుగా ఉన్నప్పటి ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడిస్తాం. ఇందుకు మాకెలాంటి అభ్యంతరం లేదు. రానున్న రోజుల్లో మా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రకటన జారీచేస్తాం అని వారు పేర్కొన్నారు.

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రమోట్‌ చేసిన ఫండ్‌లో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్‌ పౌరులుగా తమ పెట్టుబడులు నిజమేనని అంగీకరించారు. సిటీ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌లకు చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, మాజీ ఉద్యోగి అయిన తమ స్నేహితుడు అనిల్‌ అహుజా సూచన మేరకు ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చినందుకే..

- Advertisement -

హిండెన్‌బర్గ్‌పై సెబీ చర్యలు చేపట్టిందని, వారికి షోకాజు నోటీసు కూడా జారీ చేయడం జరిగిందని బచ్‌ గుర్తుచేశారు. నోటీసుకు బదులివ్వకపోగా, ఇందుకు ప్రతిస్పందనగా సెబీపై దాడి చేస్తున్నారని, ఆ సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించిందని, ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు.

బ్లాక్‌స్టోన్‌కు లబ్ధి చేకూర్చలేదు..

మార్కెట్‌ రెగ్యులేటర్‌ నిర్వహించే ‘రిక్యూసల్‌ లిస్ట్‌’లో బ్లాక్‌స్టోన్‌ ఉందని, బ్లాక్‌స్టోన్‌పై ప్రభావం చూపే నిర్ణయాల్లో తన ప్రమేయం లేదని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరి బుచ్‌ ఆదివారం స్పష్టంచేశారు. దశాబ్దాలుగా తమ కార్పొరేట్‌ కెరీర్‌లో జీతాలు, బోనస్‌లు, స్టాక్‌ ఆప్షన్‌ల ద్వారా పొదుపులో మదుపు చేశామన్నారు.

మాధబి రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సేవల సంస్థలలో పనిచేస్తుండగా, ఆమె భర్త హిందుస్థాన్‌ యూనిలీవర్‌, పేరెంట్‌ యూనిలీవర్‌తో 35 సంవత్సరాలకు పైగా అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ధవల్‌ సలహాదారుగా వ్యవహింరించే బ్లాక్‌స్టోన్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై మాధబి తిప్పికొట్టారు.

రైట్స్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలను బోర్డు ఆమోదించిందని ఆమె తెలిపారు. ధవల్‌కు బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌తో ఎప్పుడూ సంబంధం లేదని, బ్లాక్‌స్టోన్‌ ప్రైవేట్‌ ఈక్విటీలో అతని నియామకం సెబీచైర్‌పర్సన్‌గా తన నియామకానికి ముందే ఉందని మాధబి స్పష్టం చేశారు.

తాజా వివాదం ఏమిటి?

అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్‌, ఆఫ్‌సోర్‌ డొల్ల కంపెనీల వివరాలు తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది.

నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ చైర్‌పర్సన్‌ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను చూస్తే ఇది బాగా అర్ధమవుతుంది. విజిల్‌బ్లోయల్‌ పత్రాల ప్రకారం గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయి.

ఇందులో మాధబి పురి దంపతులకు వాటాలున్నాయి అని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. వీరి వాటాల విలువ 10 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ83 కోట్లు) ఉండొచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement