రాజకీయాలు ఎలా చేయాలో ఆప్ పార్టీకి తెలియదని..అవినీతి నిర్మూలనకి తమ పార్టీ కృషి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని కులులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు మాకు రాజకీయాలు తెలియవు. రాజకీయాలు చేయడానికి మేం ఇక్కడ లేము. మా ప్రయాణం అన్నా హాజరే ఉద్యమంతో మొదలైంది. తరువాత పార్టీ పెట్టాం. అవినీతిని దేశం నుంచి తరిమికొడతామని శపథం చేశాం.
ముందు ఢిల్లీలో అవినీతిని అంతం చేశాం. ఇప్పుడు పంజాబ్ లో కూడా అదే చేయబోతున్నామని చెప్పారు. అవినీతి ఆరోపణలపై తన మంత్రిని జైలుకు పంపినందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను అభినందించారు. భగవంత్ మాన్ కావాలంటే ఆ విషయాన్ని కార్పేట్ కింద తేలికగా కప్పేయవచ్చని, కానీ ఆయన అలాంటి పనికి పూనుకోలేదని అన్నారు. దానికి బదులు మాన్ మంత్రిపై చర్య తీసుకున్నారని చెప్పారు. ఒక సీఎం తన మినిస్టర్ ను జైలుకు పంపడం మీరు ఎప్పుడైనా విన్నారా .. తన ఆరోగ్య మంత్రి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన్ సాహబ్ కనుగొన్నారు. ఈ విషయం అప్పటికి ప్రతిపక్షాలకు, మీడియాకు తెలియదు. కావాలంటే ఆయన దానిని చాపకింద పారేసి ఉండేవారు. లేదా ఆ నిమిషం నుంచి తన వాటా అడిగేవాడు. కానీ ఆయన మంత్రిని జైలుకు పంపించారని కొనియాడారు.