కర్నాటక హిజాబ్ కేసును వెంటనే విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన విద్యార్థుల తరఫు న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థుల వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందన్నారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. ఈ కేసుకు.. పరీక్షలకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అత్యవసర విచారణకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని జస్టిస్ ఎన్‌వీ రమణ హితవు పలికారు. పిటిషన్లపై విచారణకు నిర్ధిష్ట తేదీని ఇవ్వడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయన్న కామత్ వాదనను తోసిపుచ్చింది. అధికారులు హిజాబ్‌తో ప్రవేశానికి అనుమతించకపోవడంతో విద్యార్థికి ఒక సంవత్సరం నష్టం వాటిల్లుతుందన్న వాదనను జస్టిస్ ఎన్‌వీ రమణ ఏకీభవించలేదు.
గతంలోనే తిరస్కరణ..
కర్నాటక ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్యలో జోక్యం చేసుకోబోతుండగా.. జస్టిస్ ఎన్‌వీ రమణ వారించారు. గతంలో కూడా ఈ అంశంపై అత్యవసర విచారణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హోలీ సెలవుల తరువాత జాబితా చేయడానికి అంగీకరించింది. దేశ వ్యాప్తంగా సంచలనమైన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది. హిజాబ్ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..