కర్ణాటకలోని ఉడుపి జిల్లా, కుండపూర్‌లో ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజర య్యేందుకు ప్రయత్నించగా అధికారులు వారించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్‌ను విధించిందని, అందువల్ల హిజాబ్‌ను ధరించి వచ్చేవారిని అనుమతించబోమని చెప్పారు. దాదాపు మూడు రోజుల నుంచి దీనిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో మాట్లాడుతూ, హిజాబ్ లేకుండా తరగతులకు హాజరు కావచ్చని తెలిపారు. దీంతో కర్ణాటకలో హిజాబ్ ధరించడం ఓ ఉద్యమంలా సాగుతోంది. ముస్లిం విద్యార్థినులు మైసూరులో ”ఐ లవ్ హిజాబ్ ” ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది.
కాగా, కర్ణాటక విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతించక పోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బాలికా విద్యాపథంలోకి హిజాబ్‌ను తీసుకొచ్చి బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం వసంతపంచమని పురస్కరించుకుని రాహుల్ ట్వీట్ చేశారు. ”విద్యార్థినుల హిజాబ్‌ను విద్యామార్గానికి అడ్డుగా రానివ్వడం ద్వారా మనం భారతదేశ బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నాం. సరస్వతీ మాత అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె తేడాలు చూపదు” అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో విద్యార్థినులకు మద్దతుగా నిలిచారు.
అయితే.. రాహుల్ ట్వీట్‌పై కర్ణాటక బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యావంతులవడానికి హిజాబ్ చాలా ముఖ్యమైనదైతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు తప్పనిసరి చేయించలేదని ప్రశ్నించింది. విద్యకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టింది. భారత దేశ భవిష్యత్తుకు తాను ప్రమాదకరమని రాహుల్ మరో సారి రుజువు చేసుకున్నారని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..