రణగడ్డగా మారుతున్న పోరుగడ్డ..
అస్త్రశస్త్రాలతో సీఎం కేసీఆర్
18న భారీ బహిరంగ సభ
అంశాలవారీగా సవాల్
త్వరలో భాజపా సభకు వెూడీ
28న అమిత్ షా రాక
సవాల్ స్వీకరిస్తారా
గతంలో వలె దాటవేస్తారా
ఇరు శ్రేణుల్లో టాప్ ఉద్వేగాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: పోరుగడ్డ తెలం గాణ ఇక పొలిటికల్ వార్‌జోన్‌గా మారబోతోంది. ప్రాంతీయ పార్టీ తెరాసను జాతీయ పార్టీ భారాసగా మార్చి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వసన్నద్ధం కాగా, ఎలాగైనా భారాసను తెలంగాణకే పరిమితం చేయాలని భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. భారాస ఇప్పటికే యుద్ధ భేరి మోగించింది. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇందుకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనుంది. మరోవైపు ప్రధాని మోడీ త్వరలో తెలంగాణలో అంతేస్థాయిలో ఏర్పాటు కానున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే, 28న అమిత్‌షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు పర్యటించి మిషన్ 90పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనున్నారు. దీంతో పండుగ తర్వాత తెలంగాణలో యుద్ధవాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ఏకంగా ప్రధాని మోడీపై విరుచుకుపడనున్నారు. దేశం వెనుకబాటుతనానికి కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణమని ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శించారు. ఇదే అస్త్రాన్ని ఈసారి నేరుగా మోడీపైనే ప్రయోగించనున్నారని భావిస్తున్నారు. ఆయా రంగాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్వాకాల వల్లే పేదలు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారని, కార్పొరేట్లు ఆర్థికంగా మరింత బల పడుతున్నారని సవివరంగా గణాంకాలతో వివరించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీల వెనుకబాటుతనం, విద్యుత్, సాగునీటి పారుదల రంగాల గురించి కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టను న్నారు. తెలంగాణలో తాము అమలు చేసి అద్భుతంగా రాణించి ప్రజల మన్ననలను ఏవిధంగా పొందిందీ వివరించనున్నారు.
దేశంలోని వివిధ ఉప ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకుని, కలిసివచ్చే పార్టీలతో కాంగ్రెస్సేతర, భాజపాయేతర కూటమిగా ముందుగా సాగనున్నట్టు కేసీఆర్ సవివరంగా తెలుపనున్నారు. ఇదే భారీ బహిరంగ సభకు వస్తున్న ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, తదితర వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ సభకు విచ్చేయడం శుభపరిణామంగా అంచనా వేస్తున్నారు. ఒక్కో రంగం, అంశాల వారీగా గణాంకాలు వివరిస్తూ, మోడీ సర్కార్ ఏవిధంగా దేశాన్ని నష్టపరుస్తున్నదీ స్పష్టం చేయనున్నారు. అలాగే, ఆయా రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఏవిధంగా అన్యాయం చేసిందీ, చేస్తున్నదీ వివరించనున్నారు. కేంద్రం నుంచి న్యాయంగా రావల్సిన నిధులు వచ్చి ఉంటే మరింత అభివృద్ధి చెంది ఉండేవారమని చెప్పనున్నారు. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, ఇందుకు నిధుల ఇబ్బంది ఏమాత్రం ఉండదని కేసీఆర్ ఆయా రంగాలకు సంబంధించిన అంకెలను బహిరంగ సభలో వివరించనున్నారు. రెండేళ్లలోనే దేశవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు నింపుతామని ఇప్పటికే చెప్పిన ముఖ్యమంత్రి అది ఎలా సాధ్యమో సవివరంగా తెలుపనున్నారు. అదేవిధంగా రైతుబంధు, దళితబంధు, తదితర పథకాలను దేశవ్యాప్తంగా ఏవిధంగా అమలు చేయనున్నదీ సవివరంగా వివరించి నేరుగా ప్రధాని మోడీకి సవాల్ విసరనున్నారు.
మోడీ, షాలు ఏం చెబుతారు?
త్వరలోనే తెలంగాణలో జరుగనున్న భాజపా భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభ జరిగిన మరుసటి రోజే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. ఖమ్మం వేదిక నుంచి కేసీఆర్ చేయబోయే ప్రసంగం ఎలాంటి రాజకీయ ఎత్తుగడతో ఉంటుందో… అది చూసిన తర్వాతే అంతకు మించిన ఎత్తుగడతో సభకు సిద్ధం కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన వాయిదా పడింది. ఈ నెలాఖరులోనే మోడీ పర్యటన ఖరారవుతుందని, పక్కా ప్రణాళికతో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభ వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు ఓ భరోసా ఇస్తారని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సవాల్‌ను స్వీకరించి ఈసారైనా సమాధానం చెప్పి ప్రతి సవాల్ విసురుతారా? లేక గత పర్యటనలో వలెనే పక్క రాష్ట్రాల గురించి దేశ ప్రగతి గురించి మాట్లాడి వెళ్లిపోతారా అన్నది విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న. అలాగే, అమిత్‌షా తన రెండు రోజుల పర్యటనలో కేసీఆర్ ఆరోపణలను తిప్పి కొడతారా? లేక కుటుంబ పాలన అంటూ ఎప్పటిలానే విమర్శలు సంధిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాగా, కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భాజపా వర్గాలు భావిస్తున్నాయి.