ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో హస్తినలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని.. ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే.
అయితే, రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు నిర్మించారు. మరోవైపు ఢిల్లీలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.
రైతు సంఘాల ‘ఛలో ఢిల్లీ’కి అనుమతి లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. హస్తినలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైన నిషేధం విధిస్తున్నట్లు సంజయ్ అరోరా స్పష్టం చేశారు. ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం పైనా నిషేధం ఉందన్నారు. దాంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటెయినర్లతో భారీ బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పరిస్థితిని సమీక్షించేందుకు సింఘూ సరిహద్దు వద్ద తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. సరిహద్దులు పంచుకొనే రహదారులను మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. నేడు పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ రైతులు ఢిల్లీ చలో మార్చ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఢిల్లీలోకి ఎలా చేరుకోవాలన్న దానిపై ఇప్పటికే 40 సార్లు రిహార్సల్స్ నిర్వహించాయని రైతు సంఘాలు తెలిపాయి.