Thursday, November 21, 2024

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట.. పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలతో గ్రామస్థుల చెంతకే వైద్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ పల్లెల్లో మౌలిక సదుపాయాలకు రాష్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేకంగా ప్రాధాన్యతను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డుల నిర్మాణం, చెత్త సేకరణకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ట్రాక్టర్‌ను సమకూర్చింది. దీంతో పదేళ్ల క్రితం చెత్త కుప్పలమయమైన గ్రామాలు ఇప్పుడు పరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అభియాన్‌లో స్వచ్ఛత గ్రామాల అవార్డులను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు ఎంపికవుతున్నాయి.

- Advertisement -

పారిశుద్ధ్యంతోపాటు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలను ఇటీవలి కాలంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పెద్ద ఎత్తున చేపట్టింది దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఏ పల్లెకు పోయినా అందమైన సీసీరోడ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారులను సీసీరోడ్లు మార్చేస్తోంది. ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణలోని పల్లెల్లో రూ.369 కోట్లతో 1231 కిలోమీటర్ల సీసీరోడ్లు నిర్మాణం కాగా… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిసెంబరు వరకు రూ.3,062 కోట్లతో 9117 కిలోమీటర్ల సీసీరోడ్లు పూర్తయ్యాయి. తాజాగా మరో రూ.1,359 కోట్లతో 17,259 సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం కానుంది.

పనులు పూర్తయ్యాక బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు ఉపాధిహా మీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను అంచనా వేసి, ఆ నిధులకు అనుగుణంగా పనులు చేపట్టాలని జిల్లాల పంచాయతీరాజ్‌ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో వైద్య సదుపాయాల కోసం పీహెచ్‌సీలను, పల్లె దవాఖానాలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఎంబీబీఎస్‌ చదివిని వైద్యుడిని అందుబాటులో ఉంచి మరీ అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్యాన్ని గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. గర్భిణీలు, బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులకు ఇంటికే మందులు పంపిణీ చేస్తుండడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement