Monday, November 18, 2024

Delhi | పార్లమెంట్‌‌లో భద్రతా వైఫల్యంపై హైపవర్డ్ కమిటీ..


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్‌‌లో భద్రతా వైఫల్యంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభ సభ్యులందరికీ లేఖ రాశారు. డిసెంబర్ 13న జరిగిన ఘటనపై లోక్‌సభ స్పీకర్ విచారం, ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు సూచించిన అన్ని అంశాలపై తక్షణమే చర్యలు చేపట్టామని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం, ఉల్లంఘనలపై క్షుణ్ణంగా విచారణ జరిపేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేశామని, అవి త్వరితగతిన విచారణ జరిపి నివేదికను అందజేస్తాయని వెల్లడించారు.

డిసెంబర్ 13న జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని చెప్పారు. పార్లమెంట్‌ భద్రతకు సంబంధించి రెండో ఉన్నతస్థాయి కమిటీ లోపాలను సమీక్షించి పలు సూచనలు చేస్తుందని తెలిపారు. అయితే ఎంపీల సస్పెన్షన్‌కు, డిసెంబర్ 13న జరిగిన భద్రతా వైఫల్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పీకర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికీ  కొంతమంది ఎంపీలు, రాజకీయ పార్టీలు రెండింటినీ ఒకేగాటన కట్టడం దురదృష్టకరమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.

కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని నియమాలను కఠినంగా అమలుపరచాలని నిర్ణయించామని, ఎంపీల సస్పెన్షన్‌ కేవలం పార్లమెంటరీ నిబంధనలకు లోబడి తీసుకున్నదే అని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు డిసెంబర్‌ 13 నాటి ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పీకర్‌ ఓం బిర్లా ఎంపీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టే సమయంలో అన్ని పక్షాలు కలిసి ప్లకార్డులు పార్లమెంటు లోపలికి తీసుకురావద్దని, వెల్‌లోకి ప్రవేశించి రచ్చ చేయకూడదని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

సభా కార్యకలాపాలకు విఘాతం కల్గిస్తూ వ్యవహరించే తీరు, ప్రవర్తన మొత్తం దేశ ప్రజలను అసంతృప్తికి గురిచేస్తోందని స్పీకర్ అన్నారు. అందుకే కొత్త పార్లమెంటు భవనంలో అత్యున్నత ప్రమాణాలు, మర్యాదలను నెలకొల్పాలని అందరం కలిసి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సభ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు ఎంపీలను సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయానికి తాను కూడా బాధపడ్డానని, అయితే భవిష్యత్తులో సభ్యులందరూ సభ గౌరవాన్ని కాపాడతారని ఆశిస్తున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement