ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ముదురుతోంది. అక్కడ ఒక్క కాఫీ తాగాలంటే రూ.7 వేలు, కిలో అరటి పండ్లు కొనాలంటే రూ.3336 ఇవ్వాల్సిందే. కరోనా కారణంగా తమ అంతర్జాతీయ సరిహద్దులను ఆ దేశం మూసివేయడం, అంతర్జాతీయ సమాజం ఆంక్షలు, వరదలతో ఆహారానికి భారీ కొరత ఏర్పడింది. ఆహారం, ఎరువులు, ఇంధనం కోసం నార్త్ కొరియా.. చైనాపై ఆధారపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో 250 కోట్ల డాలర్ల దిగుమతులు కాస్తా 50 కోట్ల డాలర్లకు పడిపోయింది.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఎరువల తయారీ కోసం దేశంలోని ప్రతి రైతు రోజుకు 2 లీటర్ల మూత్రాన్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం అడగడం గమనార్హం. 1990ల్లో వేల మందిని పొట్టనపెట్టుకున్న ఆహార సంక్షోభమే ఇప్పుడూ ఉత్తర కొరియాలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అటు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా ఆహార సంక్షోభం ఆందోళనకరంగా ఉన్నదని అంగీకరించారు. కరోనా ఒక్కటే కాకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న కారణంగా అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇక వరుస తుఫాన్లు, వరదలు ఇప్పటికే ఉన్న ఆహార కొరతను మరింత తీవ్రం చేశాయి.
ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినా ప్రస్తుతం ఉత్తర కొరియా ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ల కారణంగా సంక్షోభం ముదురుతోందని ఈ మధ్య అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సమావేశంలో కిమ్ అన్నారు. గతేడాది టైఫూన్ కారణంగా వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని చెప్పారు. దీనికితోడు వరదలు వేల ఎకరాల పంటను నాశనం చేశాయి. ఇక గతేడాది కరోనా వైరస్ కారణంగా చైనాతో సరిహద్దులను మూసేయడం కూడా నార్త్ కొరియా కష్టాలను రెట్టింపు చేసింది. సరిహద్దులను మూసేయడం వల్ల తాము కరోనాను కట్టడి చేయగలిగామని ఆ దేశం చెప్పుకున్నా.. ఈ చర్య వారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.