సంగం డెయిరీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు ఊరట లభించింది. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడలోనే ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. విజయవాడలో ఉండే అడ్రస్ ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
కాగా, సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏప్రిల్ 23న ఛైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రతోపాటు ఎండీ గోపాలకృష్ణన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మధ్యలో ఏసీబీ కస్టడీ విచారణతో పాటు పలు జైళ్లకు కూడా తిప్పారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఏసీబీ అధికారులు మాత్రం ఆస్పత్రి నుంచి జైలుకు కూడా తరలించారు. దీనిపై గతంలోనే ఏసీబీ కోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు.