Wednesday, November 20, 2024

ఢిల్లీలో హైఅలర్ట్‌.. మత ఘర్షణలతో 20 మంది అరెస్టు, బలగాల మోహరింపు

న్యూఢిల్లీ: హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గాయపడ్డవారిలో పోలీసులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. దుండగులు వాహనాలను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పు కూడా పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో ఘర్షణల నేపథ్యంలో నోయిడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. హనుమాన్‌ జయంతి ఊరేగింపులో దుండగులు కత్తులు, పిస్టళ్లు, తుపాకులతో కనిపించినట్లు ప్రత్యక్షసాక్షులు కొందరు తెలిపారు. అదే సమయంలో సి-డి మార్కెట్‌లోని సీసీ వీడియో ఫుటేజీల్లోనూ ఈ దృశ్యాలు కనిపించాయి. సమూహంలో కొందరు ఆరేడు రౌండ్లు కాల్పులు జరిపారని గాయపడిన పోలీసు ఒకరు వెల్లడించారు. కాల్పులు జరిపిన యువకుడు మైనర్‌ అని అతని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ పిల్లవాడు 2005లో జన్మించాడని చెబుతున్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం అతడి వయసు 26 ఏళ్లుగా నమోదుచేశారు. మరొక నిందితుడైన అన్సార్‌ జహంగీర్‌పురి ఏరియాలో ముస్లిం నాయకుడని, అతనిపై ఇప్పటికే దాడులు, గ్యాంబ్లింగ్‌ నేరారోపణల కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితులను వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా, వారి కుటుంబ సభ్యులు ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement