బెంగళూరు విమానాశ్రయంలో ఇతరదేశాలను వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు చేసి.. శాంపిల్స్ ను సేకరించి జీనోమ్ పరీక్షలకు పంపేందుకు చర్యలు ప్రారంభించామని కర్నాటక వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ బుధవారం తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్ పరీక్షలకు సంబంధించిన చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జీనోవ్ పరీక్షలకు పంపడమేగాక ఇదే సమయంలో బూస్టర్ డోస్ ఇచ్చే ఏర్పాట్లను ప్రారంభించామన్నారు. బెంగళూరుకు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రయాణీకులు తరచుగా వస్తుంటారని.. దీని వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదముందని మంత్రి తెలిపారు. దీంతో వైద్యసిబ్బందిని ఎయిర్‌పోర్టులో అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా బెళగావిలో మీడియాకు మంత్రి వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోని చైనా, జపాన్ వంటి దేశాల్లో కొవిడ్ కేసులు పునరావృతం అవుతున్నట్లు తెలిసిందన్నారు. అదేవిధంగా అక్కడి ఆస్పత్రులు కూడా భారీస్థాయిలో రోగులతో నిండి ఉన్నాయన్నారు. ఇటీవల భారత్‌లో వైరస్‌కు సంబంధించి మరో కొత్తవేరియంట్ నమోదైనట్లు కేంద్రం తెలిపిందన్నార. దీనిపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. వైరస్ నివారణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా వందశాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.