ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా టెర్రాంలో జవానులపై మావోలదాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఇప్పటికే 24 మంది జవానులు మృతి చెందారు. మావోయిస్టులు భారీ వ్యూ హంతోనే కూంబింగ్ దళాలపై దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. పక్క వ్యూహంతో పోలీసులపై దాడికి దిగారు. సినిమాను తలపించే లెవల్లో స్కెచ్ వేశారు మావోలు. కూంబింగ్‌లో ఉన్న జవాన్లను 3 వైపులనుంచి చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మావోయిస్టులు చెట్లపైన ముళ్ల పొదల్లో నక్కి కాల్పులు జరపడంతో ఎటువైపునుంచి దాడి జరుగుతుందో తెలుసుకునేలోపే భద్రత సిబ్బంది వైపు జరగరాని నష్టం జరిగిపోయింది.
మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్ కమాండర్‌గా ఉన్న హిడ్మా.. మోస్ట వాంటెడ్ అతనిపై 45 లక్షల రివార్డు ఉంది. హిడ్మా కోసం సీఆర్పీఎఫ్, కోబ్రా, పోలీస్ దళాలు జల్లెడ పడుతున్నాయి. దీన్ని అదునుగా చేసుకొని దళాలను ఉచ్చులోకి లాగినట్లు తెలుస్తోంది. హిడ్మా స్థానిక ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్థుల మద్దతు లభిస్తోంది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. హిడ్మా ఇప్పటికే మాస్టర్ స్ట్రాటజిస్ట్ మరియు విజయవంతమైన కార్యాచరణ కమాండర్ గా నిలదొక్కుకున్నాడు. పాఠశాలలో కేవలం 10వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లిష్ కూడా చక్కగా మాట్లాడగలడని 2015లో ఫిబ్రవరిలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నాడు. ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్లో ఉండటం కూడా అతనికి కలిసి వస్తోందని వీరప్పన్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించిన మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుత కశ్మీర్ గవర్నర్ సలహాదారు విజయ్‌కుమార్ గతంలో తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యింది. ఎలాగైనా దీటైన జవాబిచ్చి తీరాలని నిర్ణయించుకుంది. ఇప్పడు భద్రతా బలగాలు హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్‌కు సన్నద్ధమయ్యాయి. హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీనికి ఆపరేషన్ ప్రహార్-3 అన్న పేరును పెట్టారు.