‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల కావడం దాదాపు ఖరారైనట్లే. ఈ సినిమా ఓటీటీ విడుదలపై హీరో నాని అభిబానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో హీరో నాని ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘నా సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయలనుకున్నాను. ఎందుకంటే సినిమాను థియేటర్‌లోనే చూడటానికే నేను ఇష్టపడతా. కానీ నిర్మాతలు ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేశారు. దీంతో ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో థియేటర్లో టక్ జగదీష్ విడుదల కావడం వల్ల వారిపై భారం పడే అవకాశం ఉంది. అందువల్లే వారిని నేను ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తున్నా. అయితే టక్ జగదీష్ ఎక్కడ విడుదలైనా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.
కాగా షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ‘టక్ జగదీష్’ మూవీని సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.37 కోట్లకు నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే రూ.8కోట్లకు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. అంతేగాక హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ. 5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ. 52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.