ఆనందయ్య కరోనా మందు పని చేస్తుందని కొందరు, పనిచేయడం లేదని కొందరు వాదిస్తున్నారు. అసలు సంగతి పక్కన బెడితే అసలు ఆనందయ్య ఈ కరోనా మందులో ఏవేం వనమూలికలు వాడారో తెలుసుకుందాం. ఈ వనమూలికలను కొన్ని వేల ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు రకరకాల వ్యాధులను తగ్గించటానికి వాడుతున్నారు. ఈ మూలికలలో కొన్ని మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మరి కొన్ని రకరకాల రుగ్మతలను తగ్గిస్తాయి.
✪ తెల్ల జిల్లేడు పువ్వు: ఆకలి పుట్టిస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. అరుచి, శ్వాసకాసలనూ, మూలశంకనూ హరిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది. ఎండిన తెల్లజిల్లేడు పువ్వు తాంబూలంలో చేర్చుకొంటే పొడి దగ్గు, శ్లేష్మం, వగర్పు తగ్గుతాయి. ఆమ్లం ఉన్నా తగ్గుతుంది.
✪ మారేడు: వాంతులు, వేడి చేసే స్వభావం, వాత, కఫాలను తగ్గిస్తుంది. దీని ఆకులు కఫవాతాలు, ఆమ్లశూలలనూ… పువ్వులు అతిసారాన్ని, దప్పిని, వాంతిని హరిస్తాయి.
✪ నేరేడు చిగుళ్లు: పైత్యం వాంతులకు నేరేడు, మామిడి చిగుళ్ల కషాయం చల్లార్చి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దానికి తేనె కూడా జత చేస్తే మరింత గుణం చూపిస్తుంది.
✪ వేప ఆకులు: వేప చిగుళ్లు నమిలి తింటే అరుచి, నోటి దుర్వాసన, పైత్య వికారాలు, తల తిరగడం, వాంతుల వంటివి పోతాయి. కడుపులోని నులిపురుగులు, జ్వరం, మేహం, కుష్టు, పిత్తము, విదోషాలు, వ్రణములను హరిస్తుంది. వేపాకు కళ్లకు మేలు చేస్తుంది.
✪ డావరడంగి: మూల వ్యాధుల్ని హరిస్తుంది. కఫసంబంధమైన వాపుల్ని తగ్గిస్తుంది. పచ్చ కామర్ల వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జ్వరహరము, కాసశ్వాసలను హరిస్తుంది. ఇది క్రిమిహార గణములోని వస్తువు.
✪ పిప్పింట ఆకుల చెట్టు: శ్లేష్మం, చర్మరోగాలు, క్రిములను పోగొడుతుంది. రకరకాల దగ్గులు తగ్గిస్తుంది.
✪ నేల ఉసిరి చెట్టు: విషం, పిత్తకఫాలను హరిస్తుంది. రక్తదోషాలు, దురదలను పోగొడుతుంది. కంటి మంటలు తగ్గిస్తుంది. మూత్ర రోగాలు శమింపజేస్తుంది.
✪ గుంటకలగర ఆకు: కఫవాతాలు, ఉబ్బురోగాలు, వాపులు, విషాలు హరిస్తుంది. జ్వరహరం. నేత్ర, శిరోవ్యాధులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్రిములను నశింపజేస్తుంది. హృద్రోగాలు, చర్మరోగాలు, దంత వ్యాధుల నుంచి కాపాడుతుంది. మిరియాలను గుంటకలగర రసంతో నూరి, మాత్రలు చేసి, గుంటకలగర రసంతో సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
✪ కొండ పల్లేరుకాయ: శక్తినిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది. పొత్తికడుపును శోధిస్తుంది. మేహశమనకారి. తపమరం. హృద్రోగాలు, శ్వాసకాసలను పోగొడుతుంది. శూలలు, మూలశంకలు, కుష్టురోగాలు హరిస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. త్రిదోషహరము విశేషించి వాత వ్యాధులను తగ్గిస్తుంది. సెగ రోగాల్లో చురుకునకు హితకరమైనది.
✪ ముళ్ల వంకాయ/ వాకుడు చెట్టు: అరుచి, కఫ, వాత, జ్వరం, ఆమ్లదోషాలను హరిస్తుంది. దోషహరం. హృద్రోగాలు పోగొడుతుంది. కాసశ్వాసలను, పడిశాన్ని, ఆర్తవదోషాలను పోగొడుతుంది. క్రిమి హృద్రోగాలను శమింపజేస్తుంది. పార్శ్వశూలలను జయిస్తుంది.
✪ తోక మిరియాలు: వాత, కఫ దోషాలు, అరుచి, సుఖరోగాలను పోగొడుతుంది. రుచిప్రదమైనది. దీపనము, పాచనము హృదయానికి మంచివి. దీని కషాయం మూత్రాన్ని వృద్ధి చేస్తుంది. సెగ, సవాయి, శుక్లనష్టము, శ్వేతప్రదర, మూలశంక, మూత్రకృచ్ఛ రోగాలకు బాగా పనిచేస్తుంది. చలువ మిరియాలు నోటిలో వేసుకుని నమిలితే క్లిష్టమైన కాసలు కూడా తగ్గుతాయి. యోనిశూల, మేడ్రశూల, మంటలు తగ్గిస్తుంది. దీని తైలాన్ని పన్నీరులో కలిపి తలకు మర్దనా చేస్తే తలనొప్పులే కాకుండా సవాయి వల్ల కలిగే శిరోవ్యాధులు తగ్గుతాయి.