Sunday, November 24, 2024

ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు భారీగా డ్రగ్స్ తరలింపు

దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. ఐతే దీనికి ఏపీతో లింకులుండడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్లలో వచ్చిన ఆ హెరాయిన్ సంచులు.. గుజరాత్‌ మీదుగా ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (అధికారులు గుర్తించారు. సెప్టెంబరు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రెండు కంటైయినర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో బ్యాగుల్లో నింపిన పౌడర్ లాంటి పదార్థం కనిపించింది. ఏంటని ఆరా తీస్తే.. టాల్కమ్ పౌడర్ అని దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు చెప్పారు. ఐనా అధికారులకు అనుమానం తొలగలేదు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తే అది హెరాయిన్ అని తేలింది. అంత భారీ మొత్తంలో హెరాయిన్ ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.

ఒక కంటైనర్‌లో 1999.579 కిలోల హెరాయిన్ దొరికింది. రెండో కంటైనర్‌లో 988.64 కేజీలు పట్టుబడింది. మొత్తంగా 2988.219 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్ఘానిస్తాన్‌ నుంచి టాల్కమ్ పౌడర్ ముసుగులో హెరాయిన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. అప్ఘాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ ఇరాక్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ముంద్రా పోర్టుకు తరలించారు. ముంద్రా నుంచి విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. ఆ డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్ని కంటైనర్లు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? అనే వివరాలను కూపీ లాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌లోని గాంధీ ధామ్, మాంద్వీలో అధికారులు సోదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement