Thursday, November 21, 2024

Delhi | మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్.. ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మణిపూర్‌లో చదువుకోడానికి వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో హెల్ప్‌లైన్‌తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాకాండ, ఆ కారణంగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్ సహా 8 జిల్లాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ, కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్న కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడికి చదవుకోడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎటూ కదల్లేని పరిస్థితిలో తాముంటున్న హాస్టల్ గదులు, అద్దె గదుల్లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో దాచుకున్న ఆహార నిల్వలు అయిపోయాయి.

రాష్ట్రంలో మళ్లీ శాంతి నెలకొనే వరకు అక్కడ చదువుకుంటున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులను తమ తమ స్వస్థలాలకు పంపించేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సహాయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రాష్ట్రానికే చెందిన వేలాది మంది నిర్వాసితులకు సాయుధ బలగాలు రక్షణ కల్పిస్తూ క్యాంపులకు తరలిస్తున్నాయి. మరోవైపు ఆ రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు, పౌరులను తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇంఫాల్ నుంచి అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నాయి.

ఇదిలా ఉంటే మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులను సురక్షితంగా ఆ రాష్ట్రం నుంచి బయటపడేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది.

- Advertisement -

మణిపూర్ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. హాస్టల్ గదులు, అద్దె గదుల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో సూచిస్తూ కొన్ని నెంబర్లను విడుదల చేశారు. హింసాకాండ నేపథ్యంలో మణిపూర్‌లో టెలీకాం, ఇంటర్నెట్ సేవలు నిలిపేసిందున సమాచారం ఇవ్వలేని విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రులు అధికార యంత్రాంగంతో పంచుకోవాలని సూచించారు.

హెల్ప్‌లైన్ నెంబర్లు
011-23384016
011-23387089

Advertisement

తాజా వార్తలు

Advertisement