ప్రజా పాలన విజయోత్సవాల్లో ఆఖరి రోజున రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజును రాజకీయాలకు అతీతంగా పండుగల జరుపుకోవాలి అని అన్నారు. అలాగే ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరచాలి అని అనుకుంటే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 9న ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది అని పేర్కొన్నారు.
కవులు, కళాకారులకు సన్మానం..
తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీని తెలంగాణ ప్రభుత్వం శాలువా కప్పి సన్మానించింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన శిల్పి రమణా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసిన కొందర్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యం కోసం సర్వం త్యాగం చేసిన కొందరు ప్రముఖులను, కవులు, రచయితల్ని సన్మానించడంతో పాటు వారికి ఆర్థికంగా చేయూత అందించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
తెలంగాణ గేయం రచించిన అందెశ్రీతో పాటు గూడ అంజయ్య, గద్దర్, గోడిశాల జయరాజ్, గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్ తేజ, పైడి జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు (అమరవీరుల స్థూపం రూపశిల్పి) లాంటి 9 మంది కవులు, రచయితలు, కళాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.1 కోటి రూపాయల ఆర్థిక సాయం, తామ్ర పత్రాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’’ సీఎం ప్రకటించారు.