హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీ పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాయితో ఉన్న ఆడియో టేప్ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఆడియో.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు మోహరించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నియోజక వర్గంలోని ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనని ఇప్పటికే ఎంపీ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కూడా చెప్పారు. సోదరుడికి మద్దతు ఇవ్వాలని చెప్పడమే ఇప్పుడు సమస్యగా మారింది. ‘ మునుగోడులో ఈసారి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలి. రాజగోపాల్‌రెడ్డి అనేక సమయాల్లో మంచి, చెడులకు సాయం చేశారు. నాకు పీసీసీ పదవి వచ్చాక.. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అందరికి న్యాయం చేస్తాను ‘ అని ఓ కాంగ్రెస్ నేతలకు ఎంపీ కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి రాహుల్.. అస్ట్రేలియాకు ఎంపీ వెంకట్‌రెడ్డి
ఒక వైపు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఈనెల 23న రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అందులో టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలున్నారు. రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర, మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కీలకమేనని, ఇలాంటి సమయంలో వెంకట్‌రెడ్డి విదేశీ టూర్‌కు వెళ్లడమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా కోమటిరెడ్డి ఫోన్ కాల్ ఆడియోపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ కేడర్ కూడా వెంకట్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు.
ఆ ఆడియో ఫేక్ : జబ్బార్
మునుగోడులో బీజేపీ అభ్యర్థి, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ వెంకట్‌రెడ్డి పోన్ కాల్ వాయిస్‌తో వచ్చిన ఆడియో ఫేక్ అని.. ఫోన్లో ఎంపీ కోమటిరెడ్డితో మాట్లాడిన వ్యక్తి జబ్బార్ ఖండించారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని వెంకట్‌రెడ్డి ఫోన్ చేశారని, అప్పటి పాత వీడియోను వైరల్ చేసి ఇప్పుడు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన వివరించారు.