Friday, November 22, 2024

పవన్‌ హన్స్‌ ప్రైవేటుపరం, స్టార్‌9 మొబిలిటీ కైవసం.. అప్పుల్లో హెలికాప్టర్‌ సర్వీస్‌ కంపెనీ

హెలికాప్టర్‌ సర్వీస్‌ కంపెనీ పవన్‌ హన్స్‌ను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ అయిన పవన్‌ హన్స్‌ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయింది. జూన్‌లోగా పవన్‌ హన్స్‌కు అప్పగించే ప్రక్రియ పూర్తి అవుతుందని ఓ అధికారి వివరించారు. పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌లో తన 51 శాతం వాటాను విక్రయించడానికి స్టార్‌9 మొబిలిటీకి రూ.211.14 కోట్లను బదలీ చేయడానికి ప్రభుత్వం గత నెలలో ఆమోదించింది. ఇక ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌కు 49 శాతం వాటా ఉంది. అయితే వరుస నష్టాలతో కేంద్రం పవన్‌ హన్స్‌లో వాటాను ఉప సంహరించుకునేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే ఓఎన్‌జీసీ సైతం తన వాటాను కేంద్రం నిర్ణయించిన వాటాకే అమ్మేందుకు సిద్ధమైంది. కేటాయింపులు వచ్చే వారం జారీ చేయనున్నారు. ఆ తరువాత కొనుగోలుదారులు కంపెనీ అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. ఒకటిన్నర నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

గడ్కరీ, నిర్మలమ్మ గ్రీన్‌ సిగ్నల్‌…

ఈ అమ్మకానికి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ సభ్యులు కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాధిత్యలు ఆమోదం తెలిపారు. 2019-20లో పవన్‌ హన్స్‌ రూ.28.08 కోట్లు, 2018-19లో రూ.69.2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2020-21లో రూ.100 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. అందుకే కేంద్రం పవన్‌ హన్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అధికారుల వివరాల ప్రకారం.. స్టార్‌ మొబిలిటీకి కూడా ఓఎన్‌జీసీ ఆఫర్‌ను అంగీకరించాలా.. వద్దా.. అని నిర్ణయించుకోవడానికి అదే రోజుల సమయం ఇవ్వబడుతుంది. పవన్‌ హన్స్‌ 1985లో స్థాపించబడింది. ప్రస్తుతం కంపెనీకి 42 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్ల సగటు జీవిత కాలం 20 ఏళ్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement