Saturday, November 23, 2024

Gujarat | హడలెత్తించిన అకాల వర్షాలు.. పలు జిల్లాలు అతలాకుతలం

అహ్మదాబాద్‌: అకాలవర్షాలు గుజరాత్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. పలుప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు 20 మంది మృతిచెందినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని మొత్తం 252 తాలూకాల్లో 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

సూరత్‌, సురేంద్రనగర్‌, ఖేడా, తాపి, భరూచ్‌లో 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50 సెం.మీ. నుంచి 117 మి.మీ వర్ష పాతం నమోదైంది. రాజ్‌కోట్‌, మోర్బీ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. పిడుగుపాటుకు 20 మంది బలయ్యారు. దాహూద్‌ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

అహ్మదాబాద్‌, అమ్రేలీ, సూరత్‌, సురేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు మరో 11 మంది మరణించినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలతో పలువురు మృతిచెందడంపై కేంద్ర హూంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర లోనూ రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement