చైనాలో వంతెనను భారీ రవాణా నౌక ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. నేటి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ నౌక ఫోష్మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది.
ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి లోడు లేదని స్థానిక ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి కారణమైన నౌక కెప్టెన్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. గాలింపు పూర్తయ్యాకే బాధితుల సంఖ్య తేలనుందని అధికారులు చెబుతున్నారు.