హైదరాబాద్, ఆంధ్రప్రభ : వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతోపాటు దక్షణి ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, పరిగి, చేవెళ్ల, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం 7.6కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉందని, దీనివల్ల వచ్చే 24గంటల్లో తీవ్ర వాయిగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఒడిశా, చత్తీస్‌గడ్ మీదుగా పశ్చిమ వాయివ్య దిశగా వాయిగుండం కదులుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40కి. మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.