ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈయేడు గణతంత్ర వేడుకలలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు పాల్గొననున్నాడు. ఈ మేరకు ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 14వేల మంది భద్రతా సిబ్బందిని మోహించారు.
ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపు జరిగే వేడుకల కోసం కేంద్ర భద్రతా సంస్థలతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. కర్తవ్య మార్గ్పా లోని ప్రధాన ప్రాంతంలో దాదాపు 14వేల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తామని ఆయన చెప్పారు. కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్‌లు, పీసీఆర్ వ్యాన్‌లు, మోర్చాలు, యాంటీ డెమోలిషన్ డిటెక్షన్, స్వాట్ టీమ్‌లను విధి నిర్వహణతో పాటు ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాలలో మోహరిస్తారని దీపేంద్ర పాఠక్ చెప్పారు.
అలాగే, ఢిల్లీలోని “సున్నిత” ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామని కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. వివిధ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచామని వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తామన్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.