Saturday, November 23, 2024

Gold Sales | భారీగా బంగారం అమ్మకాలు.. ఫెస్టివల్‌, ధనత్రేయోదశీ ప్రభావం

పండుగల సీజన్‌లో కన్జ్యూమర్‌ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. పండుగలు, ధంతేరాస్‌ మూలంగా బంగారం, వజ్రాలు ఇతర నగాల అమ్మకాలు కూడా భారీగానే ఉన్నాయి. దేశంలో బంగారానికి డిమాండ్‌ 7.7 శాతం పెరిగిందని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) తెలిపింది. బంగారం డిమాండ్‌ 42 టన్నులకు చేరింది. విలువలోనూ 10 శాతం పెరుగుదలతో ఇది 22 వేల కోట్లకు చేరినట్లు తెలిపింది.

బంగారం 10 గ్రాముల ధర మూడు రోజుల క్రితం 1,500 రూపాయలు తగ్గి 60,400కు చేరింది. దీంతో అమ్మాకాలు పెరిగాయి. ఈ సంవత్సరం భారీగా అమ్మకాలు తగ్గిపోయిన మాస్‌, మిడ్‌ సెగ్మెంట్‌లో ఈ పండగల సీజన్‌లో అమ్మకాలు పెరిగాయి. ఈ రికవరీ ప్రధానంగా అర్బన్‌, సెమీ అర్బన్‌ మార్కెట్లలో కనిపించిందని రిటైలర్స్‌ తెలిపారు.

- Advertisement -

అత్యంత కీలకమైన రూరల్‌ మార్కెట్లలో మాత్రం ఇంకా రికవరీ కనిపించడంలేదని వీరు తెలిపారు. ధనత్రేయోదశి మూలంగా బంగారం, డైమండ్‌, ఇతర నగల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. నవరాత్రి, దీపావళీ మధ్యలో వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైనట్లు ఐబీజేఏ తెలిపింది. ఈ కాలంలో ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి.

దీపావళి సందర్భంగా కన్జ్జ్యూమర్‌ గూడ్స్‌ అమ్మకాలు ప్రతి సంవత్సరం భారీగానే ఉంటాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఈ కాలంలో మొబైల్స్‌ అమ్మకాలు 8 శాతం పెరిగాయని మార్కెట్‌ ట్రాకర్‌ కౌంటర్‌ పాయింట్‌ తెలిపింది. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా స్మార్ట్‌ టీవీల అమ్మకాలు 30 శాతానికిపైగా పెరిగాయి. కోవిడ్‌ ముందు ఉన్న సేల్స్‌ కంటే ఈ సారి వీటి అమ్మకాలు 7 శాతం పెరిగాయి.

వీటితో పాటు కన్జ్యూమర్‌ గూడ్స్‌లో ప్రధానంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, ఎయిర్‌ కండిషనర్లు అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఈ రంగాల్లో వాల్యూమ్‌ గ్రోత్‌ 6-7 శాతం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీగా అమ్మకాలు ఈ ఫెస్టివల్‌ సీజన్‌లో జరిగినట్లు అమెజాన్‌ ప్రకటించింది. టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాల నుంచి కొనుగోళ్లు 80 శాతం పెరిగినట్లు తెలిపింది. పండగల సీజన్‌ తరువాత కూడా అమ్మకాలు బాగుంటేనే పరిశ్రమ రికవర్‌ అవుతుందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement