తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నట మునిగాయి. మరోవైపు, ఈ భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఈ వర్షం కారణంగా రాజధాని చెన్నై నగరంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్టణం, విల్లుపురం, కడలూరు, కళ్లకుర్చి, రాణిపే, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగపట్టణంలోని రెండు తాలూకాలు, విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రటించారు.
మరోవైపు, వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరఫ జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.